భర్త ఇంటిముందు భార్య దీక్ష

12 Aug, 2019 11:55 IST|Sakshi
అత్తారింటి ముందు ఆరు నెలల పాపతో కలిసి బైఠాయించిన సునీత

సాక్షి, ఖమ్మం(పాల్వంచ) : పెళ్లికి ముందే మరో మహిళతో సహజీవనం చేయడమేగాక ఒక కూతురు ఉన్న విషయాన్ని దాచి తనను పెళ్ళి చేసుకున్నాడని, తనకు న్యాయం చేయాలని ఓ మహిళ అత్తారింటి ఎదుట బైటాయించింది. తనకు కూడా కూతురు పుట్టడంతో వదిలించుకోవాలని చూస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. పట్టణంలోని ఇందిరా కాలనీకి చెందిన ద్రాక్ష భాస్కర్‌ రావు రెండో కొడుకు వాసు బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన సునీతను 2018 ఫిబ్రవరి 24వ తేదీన వివాహం చేసుకున్నాడు. పెళ్ళి అయిన రెండో రోజే భర్తకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందనే విషయాన్ని తెలుసుకుని నిలదీసింది. అయితే గిట్టని వాళ్లు చేసే పని అని వాసు నమ్మించాడు. కొంత కాలానికి అది నిజమేనని అతడే భార్యకు చెప్పాడు.

ఈ లోగా సునీత కూడా గర్భవతి కావడంతో పాటు వారి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. 2019 ఫిబ్రవరిలో సునీత ఒక పాపకు జన్మనిచ్చింది. కూతురు పుట్టిందని మరింత భార్యపై కక్ష పెంచుకున్నాడు. ఆమెను చిత్రహింస పెట్టసాగాడు. భర్తతో పాటు అత్తమామలు సైతం వేధిస్తుండటంతో తాళలేక ఆమె పుట్టింటికి వెళ్ళింది. ఈ విషయంపై బూర్గంపాడు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోక పోవడంతో తనకు న్యాయం జరగడం లేదని... ఆదివారం పాల్వంచలోని ఇందిరాకాలనీలో ఉంటున్న అత్తామామల ఇంటి ముందు కూతురు లిఖిత, తల్లి విమలతో కలిసి బైఠాయించింది.  

తీవ్ర స్థాయిలో వాగ్వాదం 
సునీత అత్తారింటి ముందు బైటాయించడంతో మామ భాస్కర్, మరిది వేణులతో తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటు చేసుకుంది. అయితే తన భర్త వాసు ఎక్కడున్నది తెలపాలని, ఇక్కడికి పిలిపించి న్యాయం చేయాలని సునీత వాపోయింది. భర్త వేరే మహిళతో పాల్వంచలోనే ఇటీవల కాపురం పెట్టాడని ఆరోపించింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ తిరుపతి, సిబ్బందితో అక్కడి చేరుకున్నారు. స్టేషన్‌కు రావాలని, వాసుని పిలిపించి తగు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. కానీ తనకు అత్తారింటి వద్దే న్యాయం చేయాలని, అప్పటి వరకు ఇక్కడే ఉంటానని బైఠాయించింది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా