చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకుందాం: మంద కృష్ణ

27 Feb, 2015 23:52 IST|Sakshi

వరంగల్ (మానకొండూర్/ హన్మకొండ): ఎస్సీ వర్గీకరణపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో తాడోపేడో తేల్చేకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్‌లో శుక్రవారం జరిగిన ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల ముందు వర్గీకరణకు అనుకూలమన్న చంద్రబాబు.. అధికారంలోకి రాగానే వెనుకంజ వేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబునాయుడు మార్చి 3న కరీంనగర్ రానున్నారని, ఆయన ఇక్కడి నుంచి వెళ్లేంత వరకు వణుకు పుట్టించేందుకు మాదిగలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

శాంతియుతంగా జరిగే నిరసన సభలకు పోలీసులు అనుమతి ఇయ్యకపోతే, ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయని అన్నారు. ఏబీసీడీ వర్గీకరణపై తీర్మానం చేస్తే, చలో అసెంబ్లీ కార్యక్రమం ఉండదని, నేరుగా చలో ఢిల్లీ కార్యక్రమం ఉంటుందన్నారు. తెలంగాణలో టీపీపీఎస్సీ చైర్మన్‌గా ఘంటా చక్రపాణిని నియమించారని, ఆయన మాదిగలకు వ్యతిరేకమని అన్నారు. హన్మకొండలో మాదిగ లాయర్ల ఫెడరేషన్(ఎంఎల్‌ఎఫ్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలోనూ మంద కృష్ణ మాదిగ మాట్లాడారు. వర్గీకరణపై చంద్రబాబు వైఖరికి నిరసనగా, తెలంగాణ ప్రభుత్వ మాదిగ వ్యతిరేక వైఖరికి నిరసన మార్చి 18న రెండు రాష్ట్రాల అసెంబ్లీలను ముట్టడిస్తామన్నారు.

మరిన్ని వార్తలు