అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

7 Aug, 2015 03:50 IST|Sakshi

తాడూరు : అప్పుల బాధతో ఓ రైతు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని యాదిరెడ్డిపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బాషమోని బాలస్వామి (35) తనకున్న మూడెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. రెండేళ్లుగా పంటలసాగు ఆశించినంత రాకపోవడంవల్ల అప్పులు బాగా పెరిగిపోయాయి. మూడు బోర్లు వేశాడు. నీరు పడలేదు. అంతకుముందు ఉన్న బోర్లలో నీళ్లు పూర్తిగా ఎండిపోయాయి. ప్రస్తుతం ఖరీఫ్ సాగులో మూడెకరాల భూమిలో పత్తి విత్తనాలు నాటాడు.

వర్షాభావ పరిస్థితి కారణంగా పత్తి కూడా పూర్తిగా ఎండిపోయే దశకు చేరుకుంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి తన భార్యాపిల్లలు అదే గ్రామంలో ఉండే తమ్ముడి ఇంటికి వెళ్లారు. అప్పటికే జీవితంపై విరక్తి చెంది ఉన్న బాలస్వామి సొంత ఇంటికి గడియ వేసుకుని ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం తన కూతురు అనూష ఇంటికి వచ్చి కిటికీలోంచి చూడగా పొగలు వస్తున్నట్లు గమనించి, తన నానమ్మ, తల్లితో విషయాన్ని చెప్పింది.

దీంతో వారు ఇంటికి వచ్చి చుట్టుపక్కల వారి సహాయంతో తలుపులను విరగొట్టారు. అప్పటికే మృతిచెంది ఉన్న బాలస్వామి మరణించి ఉండడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులకు సమాచారం అందించగా ఎస్‌ఐ పురుషోత్తం ఆత్మహత్యకుగల కారణాలు, అప్పులకు సంబంధించిన వివరాలను సేకరించారు. మృతుడి తల్లి బాలకిష్టమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య ఈశ్వరమ్మ, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.

 అనాథలైన చిన్నారులు
 బాలస్వామి ఒంటిపై కిరోసిన్ పోసుకుని మృతిచెందడంతో భార్య ఈశ్వరమ్మ, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు అనాథలుగా మిగిలారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని టీఆర్‌ఎస్ నాయకులు మధుసూదన్‌రెడ్డి, సర్పంచ్ సావిత్రమ్మ, పర్వతాలు కోరారు.

మరిన్ని వార్తలు