గుండెపోటుతో రైతు మృతి

20 Aug, 2015 23:30 IST|Sakshi
గుండెపోటుతో రైతు మృతి

♦ పొలంలో పనిచేస్తూ కుప్పకూలిన అన్నదాత
♦ అప్పుల బాధతో మనోవేదన  
 
 శామీర్‌పేట్ : అప్పుల బాధతో మనోవేదనకు గురైన ఓ రైతు గుండెపోటుతో మృతిచెందాడు. కరిగెటులో పనిచేస్తుండగానే కుప్పకూలి మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని బొమ్మరాశిపేట్‌లో గురువారం చోటుచేసుకుంది. మృతుడి కుటుంబీ కులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బంటు కృష్ణ(42), నిర్మల దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. కృష్ణ తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పెట్టుబడి, కుటుంబ నిర్వహణ కోసం ఆయన అప్పులు చేశాడు. కొన్నేళ్లుగా వ్యవసాయం కూడా కలిసి రాకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.

ఈక్రమంలో గురువారం తెల్లవారుజామున పొలానికి వెళ్లిన కృష్ణ వరి నారు వేసేందుకు కరిగెటులో నాగలి కట్టాడు. ఈక్రమంలో ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి అప్పటికే కృష్ణ మృతిచెందాడని నిర్ధారించారు. అప్పులు తీర్చే మార్గం కనిపించక తన భర్త గుండెపోటుతో మృతిచెందాడని ఆయన భార్య నిర్మల కన్నీటిపర్యంతమైంది. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న ఆయన మృతితో కుటుంబం వీధిన పడిందని, ప్రభుత్వం స్పందించి ఆర్థిక సాయం అందించాలని గ్రామస్తులు కోరారు.

>
మరిన్ని వార్తలు