మనువు ఆగి.. మనసు చెదిరి..

29 Oct, 2017 11:42 IST|Sakshi

‘‘ఈ ప్రపంచమొక గొప్ప వ్యాయామ శాల. మనమంతా  ఇక్కడికొచ్చింది.. మనల్ని మనం బలవంతులుగా, శక్తిమంతులుగా తీర్చిదిద్దుకునేందుకు..! ఈ ప్రపంచమొక అద్భుతమైన పాఠశాల. మనమంతా ఇక్కడికొచ్చింది.. మనల్ని మనం జ్ఞానవంతులుగా, ఉత్తములుగా, ఉన్నతులుగా తీర్చిదిద్దుకునేందుకు..!!’’
యువతకు, స్వామి వివేకానంద చేసిన ఉపదేశమిది. పరీక్షల్లో ఫెయిలయ్యామని.. ర్యాంకు రాలేదని.. అమ్మ తిట్టిందని.. నాన్న కొట్టాడని.. పెళ్లి సంబంధం విఫలమైందని.. ప్రతిదీ సమస్యగా భావిస్తూ.. చావునే పరిష్కారంగా ఎంచుకుంటున్న ఈ యువతకు కనువిప్పు కలిగించేందుకు, చేయి పట్టి నడిపించేందుకు  ఆ వివేకానంద స్వామి మళ్లీ పుడితే ఎంత బాగుండు..!!! 

వైరారూరల్‌: ఆమె పేరు బండారు శ్రీలక్ష్మి. వైరా మండలంలోని రెబ్బవరం గ్రామం. తల్లిదండ్రులిద్దరూ రోజువారీ కూలీలు. ఈ బిడ్డను ‘లక్ష్మీదేవి’ కరుణించకపోయినా.. ‘సరస్వతీదేవి’ మాత్రం మనసారా నిండుగా దీవించింది. అందుకే, చదువులో ముందుండేది. బీటెక్‌లో చేరింది. ద్వితీయ సంవత్సరంలోకి వచ్చింది. ఈమె తండ్రి గతించాడు. తల్లి, తమ్ముడు ఉన్నారు. వారిద్దరి ఆశలు ఈమె పైనే. పేదరికమనే చీకట్లో దీపంలా దేదీప్యమానంగా వెలుగుతుందని వారు ఆశపడ్డారు. వారి ఆశలను వమ్ము చేస్తూ.. కన్నీరు మిగిల్చి.. చీకటిని శాశ్వతం చేస్తూ ఆమె ఈ లోకం నుంచి వెళ్లిపోయింది.

ఎందుకు..? ఎలా..? ఎప్పుడు..? ఎక్కడ..?
రెబ్బవరం గ్రామస్తులైన బండారు సీతయ్య–బ్రాహ్మయి దంపతులకు కూతురు శ్రీలక్ష్మి(21), కుమారుడు భాస్కర్‌ ఉన్నారు. మూడేళ్ల క్రితం సీతయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి తల్లి ఇంటి బాధ్యతలను బ్రాహ్మయి నెత్తినేసుకుంది. కూలీ పనులు చేస్తూ పిల్లలను సాకుతోంది. చదివిస్తోంది. వీరి కుటుంబం కొన్నేళ్ల కిందట హైదరాబాద్‌లో స్థిరపడింది. బ్రాహ్మయి అక్కడే కూలీ పనులు చేస్తోంది. తల్లికి ఆసరాగా కుమారుడు భాస్కర్‌ కూడా కూలీ పనులు చేస్తూనే డిగ్రీ చదువుతున్నాడు. పాలిటెక్నిక్‌ పూర్తిచేసిన శ్రీలక్ష్మి, జగిత్యాల జిల్లా నాచుపల్లిలోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (జేఎన్‌టీయూహెచ్‌) ఇంజనీరింగ్‌ ద్వితీయ సంవత్సరంలో చేరింది. అక్కడి హాస్టల్‌లో ఉంటోంది. హాస్టల్‌లోని తన గదిలో శనివారం.. ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

‘‘శ్రీలక్ష్మికి పెళ్లి సంబంధం కుదిరింది. ఇంతలోనే, తాను మరొక అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ పెళ్లికి అబ్బాయి నిరాకరించాడు. రెండు రోజులుగా దిగాలుగా ఉంటోంది. ఇంతపని చేస్తుందని అనుకోలేదు’’ అని కుటుంబీకులు తల్లి, తమ్ముడు గుండెలవిసేలా రోదిస్తున్నారు. తమ ఇంటి దీపమై వెలుగుతుందనుకున్నామని తల్లి, తనకు అండగా.. ఆసరాగా ఉంటుందనుకున్నానని తమ్ముడు గుండెలు బాదుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు