కార్మికుల భద్రత గాల్లో దీపం!

9 Mar, 2015 02:17 IST|Sakshi

పరిశ్రమల్లో కార్మికుల భద్రత గాల్లో దీపంగా మారింది. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియదు. ఎప్పుడు ఎవరి ప్రాణం పోతుందో ఎరుగరు. పరిశ్రమల యజమానులు అభాగ్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రక్షణచర్యలు పాటించకపోవడంతో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుని కార్మికులు మృత్యువాతపడుతున్నారు. మరికొందరు పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం బారినపడి అనారోగ్యానికి గురవుతున్నారు.
 
 షాద్‌నగర్ : రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో, జిల్లాకు ముఖద్వారంలో ఉన్న షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, కొందుర్గు, ఫరూఖ్‌నగర్ మండలాల్లో సుమారు 156 పరిశ్రమలు ఉన్నట్లు సంబంధితశాఖ లెక్కలు చెబుతున్నాయి. వీటిలో 90భారీ, 66 మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా ప్లాస్టిక్, వస్త్రతయారీ, గృహోపకరణాలు, ఐరన్ తదితర పరిశ్రమలు ఉన్నాయి.
 
 ఇందులో 90శాతం కాలుష్యం వెదజల్లే పరిశ్రమలే ఉన్నాయి. వీటిలో దే శంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారు సుమారు 18వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. పొట్టచేత పట్టుకుని బతుకుదెరువు కోసం జిల్లాకు వచ్చిన ఒ డిశా, చత్తీస్‌ఘడ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఆయా పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువగా రోజువారీగా కూ లీ రూ.150 నుంచి రూ.200 పొం దుతున్న వారే 80శాతం మంది ఉన్నారు.
  అయితే పరిశ్రమల్లో కార్మికులు యంత్రాల వద్ద పనిచేసే సమయం లో రక్షణ పరికరాలు ధరించాల్సి ఉంది. హెల్మెట్, హ్యాండ్‌గ్లౌస్, కం టి అద్దాలు, షూస్ పరిశ్రమల యా జమాన్యం సరఫరా చేయాలి.
 
  కానీ ఇవి మచ్చుకైనా కనిపించడం లేదని కార్మికులు, కార్మిక సంఘాల నేతలు వాపోతున్నారు.  ఈ పరికరాలు ఉంటే ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రమాదం సంభవించినప్పుడు క్షతగాత్రుడికి ప్రాథమిక చికిత్స అందించేందుకు ఫస్ట్ ఎయిడ్ బాక్సులు కూడా అందుబాటులో లేవని చెబుతుండటం చూస్తే.. పరిశ్రమల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా పరిశ్రమల యజమానులు లాభర్జనే ధ్యేయంగా కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని పలువురు నేతలు పెదవివిరుస్తున్నారు.
 
 మృత్యువాత పడుతున్న కార్మికులు
 షాద్‌నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల్లో యజమానుల నిర్లక్ష్యం వల్ల కార్మికులు మృత్యువాత పడుతున్నారు. కార్మికులకు సరైన రక్షణ పరికరాలు అందచేయక పోవడంతో వారు నిత్యం మృత్యువుతో చెలగాటమాడాల్సి వస్తోంది. మూడేళ్ల కాలంలో సుమారు 38మంది కార్మికులు మృతి చెందినట్లు రికార్డులు చెబుతున్నాయి.  గత డిసెంబర్‌లో కొత్తూరు మండలం తీగాపూర్ శివారులో ఉన్న ఓ పరిశ్రమలో టైర్ల బాయిలర్ పేలి ముగ్గురు కార్మికులు మృత్యువాతపడ్డారు.
 ఇదే మండలంలోని రాయలసీమ ఇండస్ట్రీస్‌లో యంత్రం మీదపడి ఓ కార్మికుడు ప్రాణాలు విడిచాడు. పక్షం రోజుల వ్యవధిలో ఇదే పరిశ్రమలో మరుగుతున్న ఇనుపద్రవం మీదపడి మరో కార్మికుడు చనిపోయాడు.
 
  జనవరిలో వీర్లపల్లి గ్రామ శివారులో ఉన్న మహాశివశక్తి పరిశ్రమలో యంత్రం వద్ద పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన కార్మికుడు ఇనుపద్రవం మీదపడి మృతిచెందాడు. ఈ పరంపరలో ఈనెల 7న కొత్తూరు మండలంలోని వీర్లపల్లి గ్రామశివారులో ఉన్న స్లెడ్జ్ పరిశ్రమలో బీహార్ రాష్ట్రానికి చెందిన కార్మికుడు రాకేశ్‌కుమార్ శుక్లా(45) యంత్రం బెల్టులో పడి ప్రాణాలు విడిచాడు. నెలకు ఒకసారైనా పరిశ్రమలను తనిఖీచేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతోనే కార్మికులు మృత్యువాత పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇకనైనా విధిగా పరిశ్రమలను సందిర్శించి అటూ కార్మికులు, ఇటూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు