ఎర్రజెండా 'అండ'గా ఉంటుంది | Sakshi
Sakshi News home page

ఎర్రజెండా 'అండ'గా ఉంటుంది

Published Mon, Mar 9 2015 2:13 AM

ఎర్రజెండా 'అండ'గా ఉంటుంది

ఖమ్మం: కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలు చేయాలని.. వారికి 'ఎర్రజెండా' అండగా నిలుస్తుందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ కార్పొరేట్లకు తొత్తుగా మారి పేదలను సంక్షేమానికి దూరం చేయాలని చూస్తోందని, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఎడాపెడా హామీలు ఇవ్వడం తప్ప చేసేదేమీ లేదని ఆయన ధ్వజమెత్తారు. ఖమ్మంలో సీపీఐ తెలంగాణ రాష్ర్ట ప్రథమ మహాసభల్లో భాగంగా ఆది వారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన ప్రారంభసభలో ఆయన ప్రసంగించారు. డబ్బు, సోషల్ మీడియాను గుప్పెట్లో పెట్టుకున్న కార్పొరేట్ శక్తులు కావాలనే మోదీని అధికారంలోకి తెచ్చాయన్నారు. బీజేపీ అధికారంలోకి రావడంతో సంఘ్ పరివార్ మతోన్మాదాన్ని రెచ్చగొడుతుందని దుయ్యబట్టారు. 

దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన జాతీయ నాయకులను అవమానించే చర్యలకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఒడిగడుతున్నాయని ఆరోపించారు. జాతిపితగా కొలిచిన గాంధీని హత్యచేసిన గాడ్సెకు విగ్రహాలు కట్టిస్తారా..? అని అయన ప్రశ్నించారు. ఈ అంశంపై హిందూ సాధువులు, సాక్షి మహారాజ్ లాంటి ఎంపీ వ్యాఖ్యలు చేసినా..  బీజేపీ నేతలు కనీసం ఈ వ్యాఖ్యలను ఖండించకపోవడం శోచనీయమన్నారు. కళాకారులు, రచయితలు, చరిత్రకారులు మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ చరిత్రలో ఉన్న వాస్తవాలు వెలికితీస్తుంటే.. వారిని కూడా సంఘ్ పరివార్ శక్తులు అంతం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మీరంతా సంపూర్ణంగా రాయండి.. గళం ఎత్తండి. ఎర్రజెండా మీకు అండగా ఉంటుంది. అవసరమైతే మీకోసం మేము ప్రాణత్యాగాలకైనా సిద్ధం..’ అంటూ ఆయన వారికి భరోసా ఇచ్చారు.

కేసీఆర్ బంగారు తెలంగాణ అంటూ ఎడాపెడా వాగ్దానాలు చేశారని.. అందులో ప్రధాన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. కేసీఆర్‌ను ఇప్పటి వరకు కమ్యూనిస్టు పార్టీలు రాజకీయ శత్రువుగా భావించడంలేదన్నారు. బీజేపీ ప్రభుత్వంలో టీఆర్‌ఎస్ చేరితే రాష్ట్రంలో ఆ ప్రభుత్వాన్ని ప్రధాన శత్రువుగా పరిగణించి పోరాటం చేస్తామన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో 4,500 మందికి పైగా అసువులు బాసారని, వీరి రక్తతర్పణంతో అంతమొందిన నిజాం పాలనను కేసీఆర్ ఎలా పొగుడుతారని ప్రశ్నించారు.  దేశంలో రైళ్లు, ఆస్పత్రులు, పోస్టల్ కార్యాలయాలు నిర్మించిన బ్రిటిష్ పాలనను కూడా పొగుడుతారా?... ఇదేనా మీ విధానం అంటూ కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు.

ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వని మోదీకి కోపం తెప్పించేలా వ్యాఖ్యలు చేయోద్దని చంద్రబాబు తన మంత్రి వర్గానికి సూచనలు చేయడం తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టడమేనని విమర్శించారు.  రాబోయే రోజుల్లో వర్గ పోరాటాలు చేయాలని ఆయన కమ్యూనిస్టులకు పిలుపునిచ్చారు. కమ్యూనిస్టుల ఉద్యమ పునరేకీకరణకు సీపీఐ కట్టుబడి ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు వివక్ష, అణచివేతకు గురవుతున్నారన్నారు. వారి వీరోచిత పోరాటాలకు వామపక్షాలు అండగా ఉంటాయని మహిళా దినోత్సవం సందర్భంగా అన్నారు.


కమ్యూనిస్టుల ఐక్యత అవసరం: తమ్మినేని
ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ శక్తుల ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి కమ్యూనిస్టుల ఐక్యత అవసరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాబోయే రోజుల్లో ఏ పంచాన ఉండకుండా కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ఉద్యమాల్లో పాల్గొనాలని రాష్ట్ర మహా సభల్లో నిర్ణయించినట్లు చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ భ్రమలు తొలిగిపోయాయని ప్రత్యేకం రాష్ట్రం కోసం పోరాడిన వారు ఇప్పుడు కేసీఆర్ విధానాలను వ్యతిరేకిస్తున్నారన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఎర్రజెండాలన్నీ ఏకమై పోరుబాట పడతాయన్నారు.

రాష్ర్టంలో వామపక్షాల ఐక్యతకు నిదర్శనంగా.. దేశ చరిత్రలోనే  పది వామపక్ష పార్టీలు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రభాకర్‌రెడ్డిని బరిలోకి దించడమేనన్నారు. సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న చంద్రులు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో వామపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఉద్యమి స్తుండడం శుభసూచక మన్నారు. సభకు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సిద్ది వెంకటేశ్వర్లు ఆధ్యక్షత వహించగా, జాతీయ కార్యవర్గ సభ్యులు కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్‌పాష, వామపక్ష పార్టీల నేతలు సురేందర్‌రెడ్డి, మూర్తి, మురహరి, జానకీరామ్, మద్దికాయల అశోక్, పల్లా వెంకట్‌రెడ్డి, గుండా మల్లేష్, విద్యావేత్త చుక్కా రామయ్య, టీజేఏసీ కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, ఐజేయూ జాతీయ కార్యదర్శి కె.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
 
టీఆర్‌ఎస్‌పై మెతక వైఖరి వీడాలి..
ప్రజల పక్షాన పోరాటం చేసే కమ్యూనిస్టు పార్టీలకు పాలక వర్గాలతో మొహమాటాలు తగవని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో పార్టీ  మెతక వైఖరి అవలంభిస్తోందని సీపీఐ రాష్ట్ర ప్రతినిధుల మహాసభలో పలువురు అభిప్రాయపడ్డారు. పార్టీ ప్రతినిధుల సభలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి రాజకీయ నివేదిక ప్రవేశపెట్టారు. నివేదికపై పలువురు రాష్ట్ర ప్రతినిధులు తమ అభిప్రాయూన్ని సూటిగా, స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. 

కేసీఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నా, వాటిని ఎండగట్టడంలో పార్టీ దూకుడుగా వ్యవహరించడం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో పెలుబుకుతున్న అసంతృప్తి, వ్యతిరేకతను కమ్యూనిస్టు పార్టీగా, ఉద్యమ శక్తిగా ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజా ఉద్యమాలు నిర్మిం చాలని ప్రతినిధుల సభ అభిప్రాయపడింది. పార్టీ నిర్మాణానికి సంబంధించి కమ్యూనిస్టు పార్టీ వైపు ప్రజలు ఆకర్షితులు కావాలంటే ఉద్యమాలే శరణ్యమని, పార్టీ నాయకత్వం కార్యకర్తలకు మరింత చేరువ కావాలని సూచించారు. కమ్యూనిస్ట్టుల పునరేకీకరణ అంశంపై సభలో వాడీవేడిగా చర్చ జరిగినట్లు సమాచారం. దీనిపై పార్టీ దిశానిర్దేశం చేయూలని సూచించినట్లు సమాచారం.

Advertisement
Advertisement