యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్య శిక్షణ

9 Jun, 2016 01:49 IST|Sakshi
యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్య శిక్షణ
  • వినూత్న పద్ధతిలో కార్యక్రమాలు చేపట్టాలి: వీకే సారస్వత్
  • రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశం
  •  

     సాక్షి, హైదరాబాద్: భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా దేశవ్యాప్తంగా యువతకు వినూత్న పద్ధతిలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, ప్రపంచవ్యాప్తంగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ పేర్కొన్నారు. దేశ జనాభాలో పనిచేసే వయసున్న వారి నుంచి ప్రయోజనాలు గత 30 ఏళ్ల నుంచి పొందలేదని... వచ్చే 3 దశాబ్దాల వరకే నైపుణ్యం, పనిచేసే వయసుగల వారి ద్వారా ప్రయోజనం పొందగలమని చెప్పారు. ఈ దిశగా నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని అధికారులకు సూచించారు. నైపుణ్యాభివృద్ధి అంశంపై ముఖ్యమంత్రుల ఉప సంఘం ఇప్పటికే నివేదిక సమర్పించిందని తెలిపారు. బుధవారం సచివాలయంలో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం జరిగింది.

    ఇందులో వీకే సారస్వత్‌తోపాటు ప్రభుత్వ సలహాదారులు పాపారావు, డాక్టర్ జీఆర్ రెడ్డి, ఏకే గోయల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, నీతి ఆయోగ్ సలహాదారులు సునీత సంఘీ, ఏకే జైన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పంచాయతీరాజ్, విద్య, కార్మిక, మున్సిపల్, సంక్షేమ శాఖలు, న్యాక్, టాస్క్ ద్వారా యువతలో నైపుణ్య అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను నీతి ఆయోగ్ సభ్యులకు రాష్ట్ర అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం సారస్వత్ మాట్లాడారు. తెలంగాణలో ఉన్న ఐటీఐలను పునర్‌వ్యవస్థీకరించాలని, నైపుణ్యం గల సిబ్బందిని నియమించాలని, మంచి సౌకర్యాలను ఏర్పరచాలని చెప్పారు. శిక్షణ పొందే ప్రతి ఒక్కరికి సాఫ్ట్ స్కిల్స్‌లోనూ నైపుణ్యం ఉండాలన్నారు.

     వృత్తిపర గౌరవం పొందాలి..
    వ్యవసాయ రంగం, నిర్మాణ రంగం తదితర రంగాల్లో శిక్షణ పొంది పనిచేసే వారు వృత్తిపర గౌరవం పొందేలా ప్రభుత్వం చూడాలని సారస్వత్ పేర్కొన్నారు. శిక్షణకు ప్రస్తుత సాంకేతికత కూడా తోడవ్వాలని సూచించారు. వివిధ శాఖల ద్వారా యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడతున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ చెప్పారు. ఈ సమావేశంలో వచ్చిన సూచనల మేరకు మరింత సమర్థవంతంగా కార్యక్రమాలు చేపడతామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన స్థాయిలో నిధులు కేటాయించాలని కోరారు.

మరిన్ని వార్తలు