హైదరాబాద్ ‘రవాణా’కు జర్మనీ పరిజ్ఞానం | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ ‘రవాణా’కు జర్మనీ పరిజ్ఞానం

Published Thu, Jun 9 2016 1:46 AM

హైదరాబాద్ ‘రవాణా’కు జర్మనీ పరిజ్ఞానం - Sakshi

  • కన్సల్టెన్సీ సేవలందించేందుకు ముందుకొచ్చిన పీటీవీ సంస్థ
  • ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ, జేఎండీ రమణరావులతో భేటీ
  •  

     సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు, త్వరలో పట్టాలెక్కే మెట్రోరైళ్లు, ప్రైవేటు క్యాబ్ సర్వీసులు వేటి దారి వాటిదే. కానీ వీటన్నింటికి ఓ క్రమపద్ధతిలో ప్రయాణికులకు చేరువ చేసే సేవలను కన్సల్టెన్సీ ద్వారా నిర్వహించేందుకు సిద్ధమని జర్మనీకి చెందిన ఓ సంస్థ ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో ఈ తరహా సేవలను అందించేందుకు రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని హైదరాబాద్‌కు పరిచయం చేసేందుకు సిద్ధమని ప్రకటించింది. ఇందులో భాగంగా బుధవారం ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, జేఎండీ రమణరావులతో సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. తాము రూపొందించిన సాఫ్ట్‌వేర్‌తో అన్నిరకాల రవాణా సాధనాలను జోడించే వెసులుబాటు ఉందని, విడివిడిగా వాటి సామర్థ్యాన్ని గరిష్టస్థాయిలో వినియోగించుకుని ఎక్కువ మంది ప్రయాణికులకు సేవలందించేలా చేయొచ్చని పేర్కొంది. జర్మనీకి చెందిన పీటీవీ అనే సంస్థ ప్రతినిధి థామస్, సంస్థ ఇండియా ప్రతినిధులతో కూడిన ఓ బృందం బుధవారం హైదరాబాద్‌కు వచ్చింది.

    వారితో సత్యనారాయణ తదితరులు భేటీ అయ్యారు. అసలు ఆ సాఫ్ట్‌వేర్ హైదరాబాద్‌కు ఎంతవరకు సరిపోతుందనే దిశగా సమాలోచనలు చేశారు. బస్సుల వృథా సమయం తగ్గింపు, ఏ సమయంలో వాటిని ఎటు తిప్పాలి, సిబ్బంది ఎలా వ్యవహరించాలి, ట్రాఫిక్ చిక్కులను అధిగమించి ముందుకు సాగే తీరు, జీపీఎస్‌తో అనుసంధానం తదితర అంశాలపై చర్చించారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ సూచనలతో ఈ సంస్థ ప్రతినిధులు హైదరాబాద్‌కు వచ్చారు. బుధవారం నాటి సమావేశంలో ఆయన కూడా పాల్గొనటం విశేషం.  ఈ సాఫ్ట్‌వేర్ హైదరాబాద్‌కు సరిపోతుందని తేలితే దాన్ని వినియోగిస్తామని సత్యనారాయణ వెల్లడించారు. 

     

Advertisement
Advertisement