దర్జాగా దోచుకున్నాడు..!

4 Apr, 2018 08:49 IST|Sakshi
బంక్‌ వద్దనున్న సీసీ కెమెరాలో మోసగాడి కదలికలు

అతడు దర్జాగా వచ్చాడు. ఆ ట్రాక్టర్‌ యజమానికి కాకమ్మ కబుర్లు చెప్పాడు. 28వేల రూపాయలు తీసుకుని, దర్జాగా వెళ్లిపోయాడు. అసలేం జరిగిందో ఆ ట్రాక్టర్‌ యజమానికి అర్థమవలేదు. ‘నువ్వు మోసపోయావ్‌’ అని ఇతరులు చెప్పేంతవరకు కూడా అతడికి తెలియలేదు. అసలేం జరిగిందంటే...

కారేపల్లి: మండలంలోని దుబ్బతండా గ్రామానికి చెందిన ఆంగోతు కృష్ణకు ట్రాక్టర్‌ ఉంది. దానికి చిన్న రిపేర్‌ వచ్చింది. కారేపల్లిలోని మెకానిక్‌ షెడ్‌కు మంగళవారం తీసుకెళ్లాడు. అంతలోనే ఆ షెడ్‌ వద్దకు, టిప్‌టాప్‌గా తయారైన ఓ యువకుడు వచ్చాడు. ‘‘మాది ఆంధ్రా. ఇక్కడ రోడ్డు కాంట్రాక్ట్‌ వర్క్‌ చేయిస్తున్నాను. మాకు మూడు డోజర్లు ఉన్నాయి. కారేపల్లి పెట్రోల్‌ బంక్‌లో మాకు ఖాతా ఉంది’’ అని పరిచయం చేసుకున్నాడు.

 ‘‘మా ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి. నేను అర్జంటుగా మా ఊరికి వెళ్లాలి. నాకు రూ.28వేలు కావాలి. లీటర్‌ డిజిల్‌ రూ.70 ఉంది కదా! బంక్‌లో రూ.65కే కొట్టిస్తాను. 400 లీటర్ల డీజిల్‌ను ఖాతాలో కొట్టిస్తాను’’ అని, ఆ ట్రాక్టర్‌ డ్రైవర్‌తో చెప్పాడు. చూడ్డానికి దర్జాగా ఉండి, మొహం దీనంగా పెట్టిన అతడిని చూసిన ఆ ట్రాక్టర్‌ యజమాని ఆంగోతు కృష్ణకు ఎటువంటి అనుమానం రాలేదు. పూర్తిగా నమ్మేశాడు. మనసులోనే లెక్కలేసుకున్నాడు. లీటర్‌కు రూ.65 చొప్పున 400 లీటర్లకు రెండువేల రూపాయలు మిగులుతాయని అనుకున్నాడు. 

‘‘సరే.. ఆ డబ్బు నేనిస్తాను. నాకు డీజిల్‌ కొట్టించు’’ అని చెప్పాడు. ఆ దర్జా బాబు సరేనన్నాడు. కానీ, కృష్ణ వద్ద అంత మొత్తం లేదు. దీంతో, ఎనిమిది కిలోమీటర్ల దూరంలోగల దుబ్బతండా గ్రామంలోగల తన ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. ఇంట్లో నుంచి రూ.28వేలు తీసుకుని తిరిగొచ్చాడు. దర్జా బాబు, రెండువేల రూపాయలతో (డీజిల్‌ పట్టేందుకని) రెండు డ్రమ్ములను కొనిపెట్టాడు. వాటిని తన ట్రాక్టర్‌పై కృష్ణ చేర్చాడు. తన ద్విచక్ర వాహనంపై కారేపల్లి పెట్రోల్‌ బంక్‌ వద్దకు ఆ యువకుడు వెళ్లాడు. వాహనాన్ని బంక్‌ బయట రోడ్డుపై ఉంచాడు.

నమోదు కాకుండా ఉండేందుకు  తన ద్విచక్రవాహనాన్ని రోడ్డుపై నిలిపి బంక్‌ వద్దకు వెళ్లాడు. ‘‘మా ట్రాక్టర్‌ వెనుకాల రెండు డ్రమ్ములతో వస్తోంది. 200 లీటర్ల చొప్పున 400 లీటర్ల డీజిల్‌ నింపాలి. కంప్యూటర్‌ బిల్లు కాకుండా, చేతితో రాసిన రశీదులు కావాలి’’ అని, బంక్‌ ఆపరేటర్లతో చెప్పాడు. ఇంతలో ఆ ట్రాక్టర్‌ రానే వచ్చింది. డీజిల్‌ కొట్టే గన్‌ను ఆంగోతు కృష్ణకు ఆపరేటర్‌ ఇచ్చాడు. బిల్లులు రాసి, ఆ దర్జా బాబుకు ఇచ్చాడు.

అతడు ఆ బిల్లులను ట్రాక్టర్‌ పైకి ఎక్కి కృష్ణకు ఇచ్చాడు. అతని నుంచి రూ.28వేలు తీసుకుని బంక్‌ బయటకు వచ్చాడు. రోడ్డు పక్కన ఆపిన తన ద్విచక్ర వాహనంపై దర్జాగా వెళ్లిపోయాడు. డీజిల్‌ పోయించడం పూర్తయింది. ట్రాక్టర్‌తో వెళుతున్న కృష్ణను బంక్‌ ఆపరేటర్లు ఆపి, ‘‘డబ్బులు ఇవ్వకుండా వెళుతున్నావేం..?’’ అని గట్టిగా అడిగారు. కృష్ణకు నోట మాట రాలేదు. ‘‘అదేమిటి..? ఆయనేగా కొట్టించింది..?

బిల్లు కూడా ఇచ్చాడు’’ అన్నాడు. ఈసారి బంక్‌ ఆపరేటర్లు అవాక్కయ్యారు. వెంటనే తేరుకుని, ‘‘ఆయన ఎవరో మాకు తెలియదు. మా ట్రాక్టర్‌ వస్తుంది, డీజిల్‌ కొట్టాలన్నాడు. చేతితో రాసిన రశీదు బిల్లు కావాలంటే ఇచ్చాం’’ అని చెప్పారు. అతడితో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. బిల్లు చెల్లించాల్సిందేనన్నారు. ‘‘నువ్వు మోసపోయావ్‌’’ అని వాళ్లు చెప్పేదాకా, అసలు జరిగిందేమిటో కృష్ణకు అర్థమవలేదు.

అతడు లబోదిబోమంటూ కారేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాలో బండి నెంబర్‌ కనిపించకుండా ఉండేందుకు, తప్పించుకునేందుకు వీలుగా ఆ ‘దర్జా’ మోసగాడు.. ముందుగానే ప్లాన్‌ ప్రకారంగా తన ద్విచక్ర వాహనాన్ని బంక్‌ బయట నిలిపాడన్న విషయం.. అప్పుడుగానీ అందరికీ అర్థమైంది. 

మరిన్ని వార్తలు