ఏసు బోధనలకు పునరంకితం కావాలి: గవర్నర్‌ నరసింహన్‌

25 Dec, 2018 05:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రపంచానికి ఏసుక్రీస్తు ప్రబోధించిన ప్రేమ, జాలి, కరుణ, దయ గుణాలకు పునరంకితం కావాల్సిన సందర్భమిది. విశ్వాసం, సత్ప్రవర్తనతో మన జీవితాలను ముందుకు నడిపించడానికి ఏసు జీవితమే స్ఫూర్తిదాయకం. ఈ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదరసోదరీమణులతో కలసి విశ్వశాంతి కోసం ప్రార్థిస్తున్నాను..’అని గవర్నర్‌ పేర్కొన్నారు. 

అందరికీ ఆదర్శం: సీఎం 
సాక్షి, హైదరాబాద్‌: క్రిస్మస్‌ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ ద్వారా మానవాళిలో ఆనందం నింపిన ఏసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. ఏసు బోధనలు సదా అనుసరణీయం. అవి మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయి. క్రిస్మస్‌ పర్వదినాన్ని ప్రజలందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలి..’అని సీఎం ఓ ప్రకటనలో ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని హోంమంత్రి మహమూద్‌ అలీ మరో ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు.  

వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు 
సాక్షి, అమరావతి: క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవులందరికీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్‌ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు ఇచ్చిన మహోన్నత సందేశాలని, క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయని జగన్‌ పేర్కొన్నారు.  

రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు: ఉత్తమ్‌ 
సాక్షి, హైదరాబాద్‌: క్రిస్మస్‌ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుభాకాంక్ష లు తెలిపారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని చేసుకుంటున్న ఈ పవిత్ర పండుగను అందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలని సోమవారం ఓ ప్రకటనలో ఆకాంక్షించారు. లౌకిక పార్టీగా సర్వమతాలను ఆదరిస్తూ మత సామరస్యం పాటిం చే పార్టీ కాంగ్రెస్‌ అని అందులో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు