అభివృద్ధిపై వైఎస్సార్‌ ముద్ర

2 Sep, 2019 12:45 IST|Sakshi

ఔటర్‌ రింగ్‌రోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్‌వే, ఆదిబట్లలోని టాటా కంపెనీ పనులకు 2005లో శంకుస్థాపన 

ప్రస్తుతం హైటెక్‌ సిటీని తలదన్నేలా ఆదిబట్ల 

ఇబ్రహీంపట్నం: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వల్లే ఆదిబట్ల నేడు ప్రపంచ పటంలోకి ఎక్కింది. రాజశేఖరరెడ్డి సుదీర్ఘ పాదయాత్ర అనంతరం 2004లో సమైక్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మొదటిసారి సీఎం అవ్వగానే ప్రపంచంలోని పెట్టుబడిదారులను హైదరాబాద్‌కు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని సంకల్పించారు. అందులో భాగంగానే టాటా వంటి దిగ్గజ సంస్థలను ఆదిబట్లకు రప్పించారు.

2005 సంవత్సరంలో ఆదిబట్ల గ్రామంలో టాటా సెజ్‌కు పూనాదిరాయి వేశారు. టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ను 60 ఎకరాల్లో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నుంచి సకల సౌకర్యాలు కల్పించారు. రూ.600 కోట్ల పెట్టుబడులతో అంతర్జాతీయ ప్రమాణాలతో టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ కంపెనీని ఆదిబట్లలో ఏర్పాటు చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం 2009లో టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ తయారీ కేంద్రం ప్రారంభించడానికి నెలరోజులు ముందుగా ఆ మహానేత మరణించాడు. 

ఔటర్‌రింగ్‌రోడ్డు ఆయన చొరవే.. 
నెహ్రూ ఔటర్‌రింగ్‌ రింగ్‌రోడ్డు 158 కిలోమీటర్లు, 8 లైన్లతో నగరం చుట్టూ విస్తరించేలా నగరానికి సునాయాసంగా వెళ్లే విధంగా డిసెంబర్‌ 2005లో ప్రారంభం అయ్యింది. దీని పనులు కూడా రాజశేఖరరెడ్డి పునాదిరాయి వేశారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే రహదారి, నగరం చుట్టూ వెళ్లడానికి వాహనదారులకు ఈ ఔటర్‌ రింగ్‌రోడ్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నేటికీ దివంగత నేత రాజశేఖరరెడ్డి జ్ఞాపకాలు ఇక్కడ ప్రజల గుండెల్లో అలాగే నిలిచిపోయాయి. 

నగరానికే మణిహారం ‘పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే’... 
రాజేంద్రనగర్‌: ఏషియాలోనే అతిపెద్ద ఎక్స్‌ప్రెస్‌వే పనులకు 2005వ సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఈ ఎక్స్‌ప్రెస్‌వేకు పీ.వీ.నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వేగా నామకరణం చేశారు. 11.06 కిలోమీటర్ల పొడవైన ఈ ఎక్స్‌ప్రెస్‌వే దేశంలోనే కాకుండా ఏషియాలోనే అతిపెద్దది. మొత్తం 315 పిల్లర్లపై దీనిని నిర్మించారు. మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రి ఎదుట ప్రధాన రహదారి నుంచి ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభమై ఆరాంఘర్‌ చౌరస్తా వరకు నిర్మించారు. దాదాపు 600 కోట్ల వ్యయంతో దీనిని పూర్తి చేశారు. నగరం నుంచి రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు ప్రయాణికులు వెళ్లేందుకుగాను దీనిని ముందుచూపుతో నిర్మించారు.

2005 మార్చి 16న శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన.. 
శంషాబాద్‌: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో జిల్లా ఖ్యాతి కూడా అదే స్థాయికి చేరింది. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలన సమయంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు పునాదులు పడడమే కాకుండా పూర్థియి స్తాయిలో అమల్లోకి కూడా వచ్చింది. కేవలం మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తిచేసుకుని గాలిమోటార్లు చక్కర్లు కొట్టాయంటే అదంతా అప్పటి ముఖ్యమంత్రి ధృడసంకల్పమేనన్నది అందరికి తెలిసిందే.. 2004 ముందు శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు ప్రతిపాదనలు పడ్డాయి.

2004 మేలో ముఖ్యమంత్రిగా మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలన పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాతే శంషాబాద్‌ విమానాశ్రయానికి భూ సేకరణ శరవేగంగా పూర్తయింది. వైఎస్‌ఆర్‌ ప్రత్యేక చొరవతో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 2005 మార్చి 16న అప్పటి యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ భూమిపూజ చేశారు. జీఎంఆర్‌ సంస్థ శరవేగంగా పనులు చేపట్టడంతో 2008 మార్చి 14  శంషాబాద్‌ విమానాశ్రయాన్ని యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ ప్రారంభోత్సవాన్ని చేశారు.

ఎయిర్‌పోర్టుకు అనుబంధంగా.. 
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణంతో ఓ వైపు పూర్తిచేసుకున్న సమయంలోనే రహదారులు అనుసంధానం కోసం ఔటర్‌ రింగురోడ్డు, పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వేలకు కూడా మహానేత వైఎస్‌ఆర్‌ హయాంలోనే పునాదులు పడటంతో పాటు శరవేగంగా పనులు కూడా పూర్తయ్యాయి. ఔటర్‌ మొదటి దశ పనులను కూడా అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి  2008లో పరిశీలించి పనులను వేగవంతం చేయించారు.

మహేశ్వరానికి మహర్ధశ.. 
మహేశ్వరం: దివంగత నేత వైఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో మహేశ్వరం మండలం రూపురేఖలు మారిపోయింది. రాజన్న ప్రత్యేక చొరవతో అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, అంతర్జాతీయ స్కూల్స్‌ పలు ఐటీ సంస్థలు, కంపెనీలను తీసుకొచ్చి అభివృద్ధికి బీజాలు వేశారు. హైదరాబాద్‌ నగరానికి మణిహారమైన ఔటర్‌ రింగురోడ్డు గ్రామానికి ఆనుకొని రావడంతో గ్రామం అభివృద్ధి వేగం పూంజుకుంది. మహానేత నగర శివారు ప్రాంతాల అభివృద్ధికి చూపిన చొరవ వల్లే ఇక్కడ ప్రస్తుతం పెద్దఎత్తున అభివృద్ధి జరగడానికి మూలకారణమని ఆయన అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో రంగారెడ్డి జిల్లాలోని వివిధ మండలాలతో పాటు మహేశ్వరం మండలంలోని వివిధ గ్రామాలకు భారీ ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది.

ప్రతి పనిలో ఆయనే స్ఫూర్తి 
పరిగి: నేను చేసే ప్రతి పనిలో వైఎస్‌ రాజశేఖరరెడ్డినే స్ఫూర్తిగా తీసుకుంటాను. ఆయన స్ఫూర్తితోనే నేను నియోజకవర్గంలో వైస్‌ సందేశ్‌యాత్ర చేపట్టి ప్రజల మన్ననలు పొందాను. ఆయన స్ఫూర్తితోనే విద్యాలయాలు, ఉచిత వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేస్తున్నాను. ఉత్తర తెలంగాణాలోనే మొట్టమొదటి డెంటల్‌ కళాశాల నాకూతురు మేగ్నా పేరుతో స్థాపించి అప్పట్లో వైఎస్‌ఆర్‌ చేతులమీదుగా ప్రారంభోత్సవం చేయించాను. వికారాబాద్‌ సమావేశంలో అడిగిన వెంటనే  చేవెళ్ల–ప్రాణహిత ప్రాజెక్టును పరిగి వరకు పొడిగించారు. ఆయన ఆప్యాయతను ఎప్పటికీ మర్చిపోలేము. – రామ్మోహన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, వికారాబాద్‌ జిల్లా 

ఆయన జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయి 
పరిగి: వైఎస్‌ఆర్‌ గారు పీసీసీ చైర్మన్‌గా ఉన్నప్పటి నుంచే ఆయన అనుబంధం ఏర్పడింది. ఆయన సీఎం అయ్యాక ఆ అనుబంధం మరింత ధృడంగా తయారయ్యింది. నేరుగా ఇంటికి వెళ్లినా నన్ను పీఏలు, సెక్యూరిటీ ఎవరూ ఆపేవారు కాదు. ప్రతి 15 రోజులకోసారి కలిసి వచ్చేవాడిని. నేను అడగకుండానే ఉపాధి హామీ స్టేట్‌ డైరక్టర్‌ పోస్టు ఇచ్చారు. ఆయన జ్ఞాపకాలన్నీ అలాగే నామదిలో పదిలంగా ఉన్నాయి. ఎంతమందిలో ఉన్నా నన్ను గుర్తించి పేరుపెట్టి పిలిచేవారు.  
– వెంకటేశం, మాజీ ఉపాధి హామీ రాష్ట్ర డైరక్టర్, పరిగి
 

మరిన్ని వార్తలు