తొమ్మిదో రోజూ ఫలితం శూన్యం

17 Jun, 2014 02:35 IST|Sakshi

* బియాస్ ఘటనలో కానరాని పురోగతి
* భారీవర్షం, ఉధృత ప్రవాహంతో గాలింపు చర్యలకు ఆటంకం
* సోనార్, లైడర్ పరికరాలతో గాలించినా దక్కని ఫలితం
* నేడు హిమాచల్‌ప్రదేశ్‌కు డీజీపీ అనురాగ్‌శర్మ

సాక్షి, హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్ మండి జిల్లా లార్జి ప్రాజెక్టు వద్ద గల్లంతైన ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం తొమ్మిదో రోజు సోమవారం గాలింపు చర్యలకు భారీ వర్షం ఆటంకంగా నిలిచింది. ప్రాజెక్టులోకి భారీఎత్తున నీరు రావడంతో గాలింపు చర్యలను చేపట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో నీటి ప్రవాహం కొంతమేర తగ్గేంత వరకు వేచిచూసి మధ్యాహ్నం నుంచి గాలింపు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీసు అదనపు డీజీ రాజీవ్ త్రివేది.. తన వెంట ఉన్న గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ కార్తికేయ, 15 మంది వాటర్ స్పోర్ట్స్ టీమ్ సభ్యులతో రంగంలోకి దిగారు. వీరితోపాటు స్థానిక పోలీసులు, ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, నావికా దళాలకు చెందిన దాదాపు 300 మంది సిబ్బంది కూడా గాలింపు చేపట్టారు. ఆరు గంటలకు పైగా వెతికినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. నావికా దళానికి చెందిన అత్యాధునిక పరికరం సైడ్ స్కాన్ సోనార్‌ను వినియోగించినా ఫలితం శూన్యం. రిజర్వాయర్ బెడ్‌పై మూడు ప్రాంతాల నుంచి సోనార్ పంపిన సంకేతాలు అడుగున మృతదేహాలు ఉన్నట్లు సూచించాయి.
 
 దీంతో వాటిని వెలికి తీయాలనే ఉద్దేశంతో గజ ఈతగాళ్లను ఆ ప్రాంతాల్లో లోపలకు పంపి గాలించినా ఎలాంటి ఫలితం లభించలేదు. ఈ మూడు ప్రాంతాలనూ మార్క్ చేసిన ఉన్నతాధికారులు ప్రవాహ ఉధృతి తగ్గిన తర్వాత మరోసారి గజ ఈతగాళ్లను అక్కడకు పంపాలని నిర్ణయించారు. మరోవైపు ఒడ్డు నుంచి నీటిలోకి లైడర్ యంత్రాన్ని వదలి గాలించినప్పటికీ ఫలితం దక్కలేదని రాజీవ్‌త్రివేది చెప్పారు. లార్జి డ్యామ్ నుంచి పండో డ్యామ్ మార్గంలో తొమ్మిది కిలోమీటర్ల మేర అణువణువూ గాలించినా మృతదేహాలు లభ్యం కాలేదని వెల్లడించారు. ఇక మిగిలిన ఏడు కిలోమీటర్ల మార్గాన్ని మంగళవారం జల్లెడ పడతామని పేర్కొన్నారు. మంగళవారం డీజీపీ అనురాగ్ శర్మ రానున్నారని, ఇప్పటివరకు చేపట్టిన చర్యల్ని ఆయనకు వివరిస్తామని, అనంతరం డీజీపీ ఆదేశాల మేరకు అవసరమైన అదనపు చర్యలు చేపడతామని త్రివేది తెలిపారు. మరోవైపు బియాస్ నది ఘటనలో లభించిన మృతదేహాలను గుర్తించిన తర్వాత మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు స్థానిక పోలీసుస్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ కాపీలను అందజేసినట్టు మండి ఎస్పీ నేగి తెలిపారు.
 
 అధికారులతో మంత్రి మహేందర్‌రెడ్డి సమీక్ష
 బియాస్‌నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం సాగుతున్న గాలింపు చర్యలను తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పర్యవేక్షించారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి నగరానికి తిరిగి రావడంతో సహాయ, గాలింపు చర్యల పర్యవేక్షణ కోసం ప్రభుత్వం మహేందర్‌రెడ్డిని హిమాచల్‌ప్రదేశ్‌కు పంపించింది. సోమవారం ఉదయం లార్జి డ్యామ్ వద్దకు చేరుకున్న మంత్రి అక్కడ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పండో డ్యామ్ వరకు అధికారులు, గజ ఈతగాళ్లతో కలసి కాలినడకన వెళ్లారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై వారికి ధైర్యాన్ని చెప్పారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రాష్ట్ర అధికారులతోపాటు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే  విద్యార్థుల జాడ కనిపెట్టడానికి వీలవుతుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు.
 
 హైదరాబాద్‌కు తిరిగొచ్చిన తల్లిదండ్రులు...
 16 మంది విద్యార్థుల కోసం జరుపుతున్న గాలింపు చర్యల్లో ఎలాంటి పురోగతి లేని నేపథ్యంలో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఇక ఆశలు వదులుకుని హైదరాబాద్ తిరిగొచ్చారు. వారం రోజులుగా అక్కడే ఉన్న తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితోపాటు వారంతా ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. అరడజను మంది విద్యార్థుల తల్లిదండ్రులు మినహా మిగిలినవారంతా తిరిగి వచ్చారని నాయిని వెల్లడించారు.
 
 ఆ బస్సుకు లెసైన్సు లేదా?
 ఆగ్రా నుంచి కులూమనాలికి ఇంజనీరింగ్ విద్యార్థులను తీసుకెళ్లిన రెండు ప్రైవేటు టూరిస్టు బస్సులో ఒకదానికి లెసైన్సు కూడా లేదని అక్కడి పోలీసుల దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా ఘటన జరిగినరోజు సిమ్లా నుంచి మనాలికి వస్తున్న సమయంలో ముందుగా వెళ్తున్న హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర మంత్రి  కాన్వాయ్‌ను ఓవర్‌టేక్ చేసిన కారణంగా మార్గమధ్యంలో పోలీసులు పట్టుకుని జరిమానా కూడా విధించారని అందులో ప్రయాణించిన కొందరు విద్యార్థులు ‘సాక్షి’కి తెలిపారు. కాగా, బస్సుడ్రైవర్‌తోపాటు ట్రావెల్స్ యజమానిని మండి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు పిలిపించి విచారించారు. ఓ బస్సుకు లెసైన్సు కూడా లేదని తేలడంతో కేసులు పెట్టడానికి అక్కడి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారని తెలిసింది.
 
 కాలేజీపై కేసు నమోదు చేయాలి...
 హిమాచల్ ప్రదేశ్‌లో విద్యార్థుల మృతికి కారణమైన విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని విద్యార్థుల బంధువులు డిమాండ్ చేశారు. విజ్ఞాన యాత్రకు పంపించిన యాజమాన్యం.. వారి భద్రతను గాలికొదిలిసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఘటన స్థలంలో నీటి ప్రవాహంలో గల్లంతైన కిరణ్ మామ నర్సింహారావు ‘సాక్షి’తో మాట్లాడుతూ, ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. విద్యార్థుల విషయమై తగు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైందని, దీంతో విద్యార్థులు మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. మరో విద్యార్థి వివేక్ బాబాయ్ ప్రభాకర్‌రావు తదితరులు మాట్లాడుతూ, కళాశాల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
 
 గాలింపుపై ఆదేశాలివ్వడానికేమీ లేదు: హైకోర్టు

 హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల గాలింపు కోసం కేంద్రంతో పాటు హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తగిన చర్యలు చేపట్టిందని, ఈ వ్యవహారంలో ఆదేశాలివ్వడానికి ఏమీ లేదని హైకోర్టు ఆఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ తేల్చి చెప్పింది. 24 మంది విద్యార్థుల గల్లంతు వ్యవహారాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకోలేదని, నావికా దళ సిబ్బందిని వెంటనే రంగంలోకి దించి మృతదేహాలను వెలికితీసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ న్యాయవాది పి.వి.కృష్ణయ్య ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది.
 
 ప్రమాదంపై ఇదేం నివేదిక
 హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు తీవ్ర అసంతృప్తి
 సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో తెలుగు విద్యార్థుల గల్లంతు వ్యవహారంలో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ తీరుపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆ దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన స్థాయి నివేదిక (స్టేటస్ రిపోర్ట్) సమగ్రంగా లేదని.. పూర్తి వివరాలతో తదుపరి విచారణ తేదీ అయిన జూన్ 19 లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విద్యార్థులను విజ్ఞానయాత్రకు పంపించిన హైదరాబాద్‌లోని వీఎన్‌ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాలను కక్షిదారుగా చేరుస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్సూర్ అహ్మద్ మీర్, న్యాయమూర్తి జస్టిస్ తార్లోక్‌సింగ్ చౌహాన్‌ల ధర్మాసనం సోమవారం ఆదేశాలు జారీచేసింది.
 
 దర్యాప్తు పురోగతిలో జాప్యంపై విస్మయం వ్యక్తం చేసిన ధర్మాసనం, సత్వరమే దర్యాప్తును పూర్తిచేసి, నివేదికను జూన్ 19 లోగా అందించాలని మండీ డివిజనల్ కమిషనర్ ఓంకార్ శర్మను ఆదేశించింది. అలాగే, జూన్ 19న కోర్టు ముందు హాజరుకావాలంటూ హిమాచల్‌ప్రదేశ్ విద్యుత్ బోర్డు ఎండీని, లార్జి ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజినీర్, రెసిడెంట్ ఇంజనీర్లకు సమన్లు జారీ చేసింది. డ్యామ్ నిర్వహణ, నీటిని దిగువకు వదిలేముందు తీసుకునే చర్యలకు సంబంధించి సమగ్ర నివేదిక అందించాలని కూడా వారిని ఆదేశించింది. బియాస్ నదిలో విద్యార్థుల గల్లంతు వార్తను హైకోర్టు సుమోటుగా తీసుకుని.. మొత్తం వివరాలతో జూన్ 16లోగా నివేదిక సమర్పించాల్సిందిగా రాష్ట్రప్రభుత్వాన్ని ఈ నెల 9న ఆదేశించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు