ఉగ్రవాదులు చొరబడ్డారు.. జర జాగ్రత్త!

8 Oct, 2016 13:20 IST|Sakshi
ఉగ్రవాదులు చొరబడ్డారు.. జర జాగ్రత్త!
న్యూఢిల్లీ : ఇద్దరు ఉగ్రవాదులు దేశ రాజధాని ఢిల్లీలోకి చొరబడ్డారని, ఆత్మాహుతి దాడిచేసేందుకు వారు సన్నద్దమై ఉన్నారని ఇంటెలిజెన్స్ రిపోర్టులు హెచ్చరించాయి. దీంతో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. రైలు ప్రయాణికులు, బస్సులలో వెళ్లేవారు, రద్దీ ప్రాంతాల్లో సంచరించేవాళ్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని తెలిపారు. జైషే మహమ్మద్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు ఓ కమర్షియల్ వాహనంలో ఢిల్లీలోకి ప్రవేశించారని ఇంటెలిజెన్స్ అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆ ట్రక్ ఢిల్లీలోని హోల్ సేల్ మార్కెట్లకి ఆపిల్స్ తరలిస్తున్న వాహనమని పేర్కొన్నారు. 
 
అలాగే పశ్చిమ భారతదేశం నుంచి ఢిల్లీలోకి ప్రవేశించే వాహనాలపై కూడా సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు చీఫ్ ఆదేశించారు. రాజధాని వ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. ఆలయ ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటుచేశారు. కొన్ని రోజుల వరకు ఇతర ప్రాంతాల నుంచి ఢిల్లీలోకి ప్రవేశించే వాహనాలపై నిషేధం విధిస్తున్నట్టు ట్రాఫిప్ పోలీసులు పేర్కొన్నారు. ఉగ్రవాదులు ప్రవేశంతో అలర్టైన పోలీసులు ఛాందీ చౌక్, పహార్ గంజ్ వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
 
ఐస్ అండ్ ఇయర్స్ స్కీమ్ను స్థానిక పోలీసులు యాక్టివేట్ చేశారు. ప్రధాన ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టులో పోలీసు పెట్రోలింగ్ పెంచనున్నారు. ఢిల్లీ మెట్రో స్టేషన్లు, రద్దీప్రాంతాలు కూడా నిఘా విభాగ ఆధీనంలోకి వచ్చేశాయి. పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయంపై ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో చర్చలు జరిపారు. మధ్య, ఉత్తర ఢిల్లీ ప్రాంతమంతా భారీ భద్రతను పోలీసులు ఏర్పాటుచేశారు. అన్ని ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేశారు.    
మరిన్ని వార్తలు