పండుగ సీజన్‌కు మార్కెట్లో కొత్త కార్లు!

11 Aug, 2016 14:00 IST|Sakshi
పండుగ సీజన్‌కు మార్కెట్లో కొత్త కార్లు!

పండుగల శోభ అంటే కేవలం స్వీట్లు, చాక్లెట్లు, కుటుంబసభ్యుల హడావుడి మాత్రమే కాదు. కొత్త కారు ఇంటికి తీసుకొచ్చి షికారుకు వెళ్లడం కూడా ప్రత్యేకతే. పండుగల సీజన్లో కొత్త కార్ల కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఈ ఆసక్తినే అనువుగా తీసుకుని పండుగల సీజన్లో ఊరించే ఆఫర్లతో వినియోగదారుల ముందుకు వచ్చేందుకు కారు తయారీదారులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే జోరుమీదున్న వాహన పరిశ్రమ, భారీ డిస్కౌంట్ ఆఫర్లతో వచ్చే ఐదు నెలల్లో కొత్త కొత్త కార్లను ఆవిష్కరించనున్నాయట.. అయితే ఈ పండుగ సీజన్లో వినియోగదారుల ముందుకు వచ్చి చక్కర్లు కొట్టనున్న టాప్-5 కార్లు ఏమిటో ఓ సారి చూద్దామా..

రెనాల్ట్ క్విడ్ ఏఎంటీ
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిన్న కారును అత్యంత శక్తిమంతమైన 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ సామర్థ్యంతో ఈ పండుగ సీజన్లోనే రెనాల్ట్ లాంచ్ చేయనుందట. కేవలం మోస్ట్ పవర్ఫుల్ ఇంజన్ మాత్రమే కాక, ఈజీ-ఆర్ ఏఎంటీ (ఆటోమేటడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్) కూడా క్విడ్ కొత్త మోడల్ ప్రత్యేకత. ఈ ఆవిష్కరణతో దేశీయ మార్కెట్లో ఇప్పటికే క్విడ్ మోడల్కున్న పాపులారిటీని మరింత విస్తరించాలని రెనాల్ట్ ఆశిస్తోంది. 1.0 లీటర్ ఇంజన్ సామర్థ్యమున్న ఈ కారు 67 పీఎస్ పీక్ పవర్ను ఉత్పత్తి చేస్తుందని రెనాల్ట్ చెబుతోంది. మెకానికల్ మార్పులు మినహాయిస్తే మిగతా ఫీచర్లన్నీ ఈ మోడల్లో క్విడ్కు సమానంగా ఉంటాయట. భద్రతాపరమైన విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకున్న రెనాల్ట్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్తో రెండు ఎయిర్బ్యాగ్స్ను ఈ కారులో పొందుపర్చిందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ కారు ఎప్పుడొస్తుందా అని ఆలోచిస్తున్నారా..? ఈ దీపావళి కానుకగా రెనాల్ట్ దీన్ని ప్రవేశపెట్టనుంది. ఎక్స్ షోరూం ఢిల్లీలో దీన్ని ధర రూ.4 లక్షలుగా ఉంటున్నట్టు అంచనా.

టాటా కైట్ 5 సెడాన్..
టియాగో మోడల్ విజయంతో ఊపుమీదున్న టాటా.. కైట్ 5 సెడాన్ కారును వినియోగదారుల ముందుకు తీసుకురావడానికి ఉవ్విళ్లూరుతోందట. టియాగో ఆధారంతో రూపొందించిన ఈ కైట్ 5 సెడాన్ను, అక్టోబర్లో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ కారులో ప్రధానమైన ప్రత్యేకత అత్యధిక బూట్ స్పేస్. ఇతర ఉత్పత్తులతో పోలిస్తే ఈ కారు గరిష్టంగా 420 లీటర్ల వరకు బూట్ స్పేస్ కలిగి ఉంటుంది. లాంగ్ డ్రైవ్, ఫ్యామిలీ అవసరాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. వినియోగదారులు ఎంచకునేలా పెట్రోల్, డీజిల్ రెండు వెర్షన్లు ఉన్నాయి. ఈ కారు ధర ఎక్స్ షోరూం ఢిల్లీలో 4.5లక్షలుగా ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

హ్యుందాయ్ ఇయాన్ ఫేస్లిప్ట్...
2011 నుంచి ఇయాన్ ఎలాంటి మార్పులు లేకుండా భారత రోడ్లపై చక్కర్లు కొడుతోంది. దీంతో పాత చింతకాయ పచ్చడిలాగా ఈ మోడల్ వినియోగదారులకు బోరుకొట్టి, కొనుగోలు తగ్గించేశారట. ఈ ప్రభావం అమ్మకాలపై పడి, ఒక్కసారిగా క్షీణతను నమోదుచేశాయి.  అమ్మకాల క్షీణతను సీరియస్గా తీసుకున్న హ్యుందాయ్, ఈ ఎంట్రీ లెవల్ మోడల్కు అప్గ్రేట్ చేసి ఫేస్లిప్ట్ పేరుతో మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. కొత్త చిన్, రీవర్క్డ్ రియర్తో అప్డేటడ్ గ్రిల్ను ఫేస్లిప్ట్లో హ్యుందాయ్ పొందుపరిచింది. అడ్వాన్స్డ్ మల్టీమీడియా యూనిట్తో ఇది రాబోతుంది. ఇయాన్ కారు ఇప్పటికే 800సీసీ యూనిట్ ఆప్షన్తో 1.0 లీటర్ ఇంజన్ ఆప్షన్ను కలిగిఉంది. ప్రస్తుతం హ్యుందాయ్ ఆప్షనల్ ఆటోబాక్స్ను హ్యాచ్బ్యాక్లో పొందుపరుస్తోందట. అక్టోబర్లో వినియోగదారుల ముందుకు రాబోతున్న ఈ ఫేస్లిప్ట్, రూ.3 లక్షల నుంచి రూ.4లక్షల వరకు ఉంటుందని అంచనా.

మారుతీ సుజుకీ బాలెనో ఆర్ఎస్...
భారత మార్కెట్లో బాలెనో హ్యాచ్బ్యాక్ మోడల్తో మెరుపులు మెరిపించిన మారుతీ మరో సరికొత్త మోడల్ను మార్కెట్లోకి తీసుకురావడానికి ఆసక్తి చూపుతోంది. బాలెనో ఆర్ఎస్ పేరుతో దీన్ని ప్రవేశపెట్టనుందట. ఫ్రంట్ లిప్ స్పాయిలర్, సైడ్ స్కర్ట్స్, నల్లని గ్రిల్, కొత్త అలాయ్స్, మరీ ముఖ్యంగా 1.0 లీటర్ టర్బో "బూస్టర్ జెట్" ఇంజన్ ల్లో కొన్ని మార్పులతో ఈ హ్యాచ్ బ్యాక్‌ను మారుతీ డిజైన్ చేసింది. ఆశ్చర్యమేమిటంటే.. దీపావళి వరకు ఈ కారును వినియోగదారులు ముంగిట్లోకి ప్రవేశపెట్టాలని మారుతీ ప్రిపేర్ అవుతోందట. దీని ధర ఎక్స్ షోరూం ఢిల్లీలో రూ.9లక్షలుగా ఉంటుందని మార్కెట్ వర్గాల టాక్.

ఫోక్స్వాగన్ అమియో డీజిల్...
హోండా అమేజ్, టాటా జిస్ట్, ఫోర్డ్ ఫిగో ఆస్పైర్, హ్యుందాయ్ అసెంట్లకు గట్టిపోటీగా వచ్చిన ఫోక్స్ వాగన్ అమియో పెట్రోల్ వెర్షన్కు.. తోబుట్టువుగా డీజిల్ వెర్షన్నూ తీసుకొచ్చేందుకు ఫోక్స్ వాగన్ అన్నీ సెట్ చేసుకుందట. చాలా ఉత్తమమైన లక్షణాలతో, హై క్వాలిటీ క్యాబిన్ను ఈ కారు కలిగి ఉంది. ఈ సెగ్మెంట్లో డీజిల్ ఇంజిన్ పరిపూర్ణమైన ఎంపికగా నిలుస్తుందని ఫోక్స్ వాగన్ చెబుతోంది. పోలో హ్యాచ్ బ్యాక్ మాదిరిగానే దీన్ని రూపొందించారు. ఇంజన్ కూడా ఒకే యూనిట్ చెందిదట. 230ఎన్ఎమ్ టార్క్ తో 90పీఎస్ పవర్ను 1.5 లీటర్ టీడీఐ ప్రొడ్యూస్ చేసేలా ఫోక్స్ వాగన్ ఈ కారును మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ కారును సెప్టెంబర్లో ఫోక్స్ వాగన్ లాంచ్ చేయనుంది. ధర ఎక్స్ షోరూం ఢిల్లీలో రూ.6.3 లక్షల నుంచి రూ.8.3 లక్షల మధ్యలో ఉంటుందని తెలుస్తోంది.

ఎప్పటినుంచో ఈ కార్లు ఆవిష్కరణలు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న కస్టమర్లను మురిపించేందుకు ఈ పండుగల సీజన్ వచ్చేస్తోందట. బ్రాండ్ న్యూ కార్లతో ఈ పండుగల సీజన్ను వినియోగదారులు ఎంజాయ్ చేసేలా ఆటోమేకర్స్ తెగ సన్నద్ధమవుతున్నాయి.

మరిన్ని వార్తలు