కోహ్లి ప్రత్యేకత ఇదే..!

4 Sep, 2017 09:46 IST|Sakshi
కోహ్లి ప్రత్యేకత ఇదే..!

సొంత గడ్డపై శ్రీలంకను భారత్‌ దెబ్బ మీద దెబ్బ కొట్టింది. ఇప్పటికే లంకతో మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌.. ఐదు వన్డేల సిరీస్‌లోనూ వైట్‌వాష్‌ చేసి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. స్వదేశంలో ఇప్పటివరకు జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లలో ఒక్కసారి కూడా క్లీన్‌స్వీప్‌ ఓటమిని ఎదుర్కోని శ్రీలంకకు కోహ్లి సేన తొలిసారి వైట్‌వాష్‌లతో దడపుట్టించింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వరుసగా రెండో శతకంతో రాణించడం.. భువనేశ్వర్‌ కెరీర్‌లో తొలిసారిగా ఐదు వికెట్లు తీయడంతో శ్రీలంక ఐదో వన్డేలోనూ చేతులు ఎత్తేసింది. దీంతో సిరీస్‌ను 5-0 తేడాతో సొంతం చేసుకున్న భారత్‌ పలు ఘనతలు సొంతం చేసుకుంది. ఆ గణాంకాలు ఇవి.
 

తాజా సిరీస్‌తో కలుపుకొని మొత్తంగా భారత్‌ ఆరుసార్లు వన్డేల్లో క్లీన్‌స్వీప్‌ విజయాలను సాధించింది. ఈ ఆరింటిలో మూడు క్లీన్‌స్వీప్‌ విజయాలు విరాట్‌ కోహ్లి నాయకత్వంలో భారత్‌కు దక్కడం గమనార్హం. కోహ్లి నాయకత్వంలో 2013లో జింబాబ్వేను 5-0తో ఓడించిన భారత్‌.. 2014-15లో శ్రీలంకతో 5-0తో, తాజాగా మరోసారి లంకపై 5-0తో సంపూర్ణ విజయాలను సొంతం చేసుకుంది. మహేంద్రసింగ్‌ ధోనీ సారథ్యంలో భారత్‌కు రెండుసార్లు సంపూర్ణ సిరీస్‌ విజయాలు లభించాయి. 2008-09లో ఇంగ్లండ్‌పై 5-0తో, 2010లో ఇంగ్లండ్‌పైనే 5-0 తేడాతో ధోనీ కెప్టెన్‌గా టీమిండియా రెండుసార్లు క్లీన్‌స్వీప్‌ విజయాలు సాధించింది. ఇక, గౌతం గంభీర్‌ నాయకత్వంలో 2010-11లో న్యూజిలాండ్‌పై భారత్‌ ఓసారి క్లీన్‌స్వీప్‌ విజయాన్ని సాధించింది.

>
మరిన్ని వార్తలు