ఓటర్లకు 80 కోట్ల పంపిణీ?

8 Apr, 2017 08:22 IST|Sakshi
ఓటర్లకు 80 కోట్ల పంపిణీ?

సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయంటేనే నిధుల వరద పొంగుతుంటుంది. అదే ఉప ఎన్నికలైతే మరికాస్త ఎక్కువ ఉండచ్చు. కానీ తమిళనాడులో ఇంతకుముందు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక విషయంలో మాత్రం డబ్బులు వరద కాదు ఉప్పెనలా పొంగుతున్నాయి. ఒక్కో ఓటుకు రూ. 10 నుంచి 15 వేల వరకు ఇస్తున్నారని సమాచారం. ఇప్పటివరకు అక్కడ ఏకంగా 80 కోట్ల రూపాయలను కేవలం నగదు రూపంలోనే పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. శశికళ వర్గం తరఫున టీటీవీ దినకరన్, పన్నీర్‌ సెల్వం క్యాంపు నుంచి మధుసూదనన్, జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌.. ఇలా పలువురు హై ప్రొఫైల్‌ నాయకులు బరిలో ఉండటం, ఈ స్థానాన్ని అందరూ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఎలాగైనా దీన్ని సొంతం చేసుకోడానికి అందరూ చాలా ‘గట్టి’గానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్‌ ఇంటి మీద, పలు ప్రాంతాల్లోను జరిగిన ఆదాయపన్ను శాఖ దాడులలో ఇందుకు సంబంధించిన ఆధారాలు బాగానే దొరికాయని అంటున్నారు. కేవలం ఒక్క దినకరన్‌ వర్గీయులే ఆర్కే నగర్‌ ఓటర్లకు రూ. 80 కోట్లు పంచారనడానికి తమకు పక్కా ఆధారాలు దొరికరాయని ఐటీ అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన ఇతర పార్టీలన్నీ కూడా కలుపుకొంటే ఎంత లేదన్నా కేవలం డబ్బు రూపంలోనే ఓటర్లకు దాదాపు రూ. 200–300  కోట్ల వరకు ముట్టాయని అనుకోవాల్సి ఉంటుంది.

వీడియో బయటపడిన తర్వాతేనా..
ఇటీవల సోషల్‌ మీడియాలో ఒక వీడియో బాగా చక్కర్లు కొట్టింది. అందులో ఒక వ్యక్తి కొంతమందికి ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయల చొప్పున ఇస్తూ.. తప్పనిసరిగా టీటీవీ దినకరన్‌కే ఓటేయాలని వాళ్లను కోరుతుంటాడు. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాతే ఆదాయపన్ను శాఖ అధికారులు మంత్రి ఇంటి మీద, నటుడు శరత్‌కుమార్‌ ఇంటి మీద దాడులు చేశారని అంటున్నారు.

>
మరిన్ని వార్తలు