కశ్మీర్‌కు 80 వేల కోట్ల ప్యాకేజీ

8 Nov, 2015 00:48 IST|Sakshi
కశ్మీర్‌కు 80 వేల కోట్ల ప్యాకేజీ

♦ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన
♦ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఇది ఆరంభం మాత్రమే
♦ యువతకు ఉపాధి, పర్యాటకానికి పునర్వైభవం
 
 శ్రీనగర్: జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి పునర్వైభవం తీసుకురావడానికి ప్రధాని నరేంద్ర మోదీ భారీ నజరానా ప్రకటించారు. అభివృద్ధి పథంలో దూసుకుపోయే రాష్ట్రంగా మార్చేందుకు రూ. 80వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వనున్నట్లు శ్రీనగర్‌లో శనివారం జరిగిన ర్యాలీలో తెలిపారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చెప్పిన.. కశ్మీరియత్ (కశ్మీర్ సంస్కృతి), జమూరియత్ (ప్రజాస్వామ్యం), ఇన్సానియత్ (మానవత్వం) సూత్రాన్ని తను కూడా అమలు చేస్తానని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. షేర్-ఎ-కశ్మీరీ స్టేడియంలో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ.. కశ్మీర్‌లో అభివృద్ధికి ఏం చేయాలనేదానిపై ప్రపంచంలో ఎవరి సలహాలు తనకు అవసరం లేదన్నారు.

కశ్మీర్ లేకుండా భారత్‌కు సంపూర్ణత రాదన్న మోదీ.. ‘ఏకత్వం’ అనే మాటను నేర్పింది కశ్మీర్ సూఫీ సంస్కృతేనన్నారు. రాష్ట్ర అభివృద్ధికి రూ. 80వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చి చేతులు దులుపుకోవాలని అనుకోవటం లేదని.. ‘ఇది ఆరంభం మాత్రమే. ఢిల్లీ ఖజానా ఉన్నది మీకోసమే. ఆ మాటకొస్తే.. మా మనసంతా మీరే’ అని మోదీ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి కలిపించేందుకు పీడీపీ-బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. వీరికి కేంద్రం పూర్తి వెన్నుదన్నుగా ఉంటుందన్నారు. ‘ఇక్కడి టూరిజం మళ్లీ ఊపిరిపోసుకుంటుంది. చేతి వృత్తులకు మళ్లీ ఆదరణ పెరుగుతుంది. వ్యవసాయం, వాణిజ్య రంగాలకు కేంద్రం సహకారం ఉంటుంది’ అని భరోసా ఇచ్చారు.

1947 నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్‌నుంచి దాదాపు 55వేల మంది శరణార్థులు వచ్చారని.. వీరితో పాటు కశ్మీరీ పండిట్లకు కూడా పునరావాసం కల్పిస్తామన్నారు. జమ్మూ-శ్రీనగర్ మధ్య ఉన్న 294 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు 11 గంటల సమయం పడుతుండటంతో.. చాలా మంది టూరిస్టులు వెనక్కు తగ్గుతున్నారన్నారు. ఈ ప్యాకేజీ నుంచి 34వేల కోట్లతో విశాలమైన హైవే నిర్మిస్తాం. ఈ మార్గంలో రెండు టన్నెళ్ల నిర్మాణం వల్ల 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుందన్నారు. ‘రెండు దశాబ్దాలుగా లోయలో అనిశ్చితిని మనం అధిగమిద్దాం. కశ్మీర్‌ను భూతలస్వర్గంగా నేను మారుస్తా’ అని అన్నారు.

మోదీ ప్రసంగానికి ముందు జమ్మూ కశ్మీర్ సీఎం ముఫ్తీ మహ్మద్ సయీద్ మాట్లాడుతూ..  కశ్మీర్ విషయంలో వాజ్‌పేయి వ్యవహరించిన తీరును కొనియాడారు. శ్రీనగర్ వేదికగా.. పాక్‌తో స్నేహానికి వాజ్‌పేయి ప్రయత్నించటంతో పదేళ్లపాటు రాష్ట్రం ప్రశాంతంగా ఉందన్నారు. భారత్ మరింతగా అభివృద్ధి చెందాలనుకుంటే.. పెద్దన్న పాత్రలో తమ్ముడికి (పాక్) స్నేహ హస్తం అందించాలన్నారు.  ప్రధాని ప్యాకేజీ ప్రకటనపై పీడీపీ హర్షం వ్యక్తం చేయగా,  అది గిమ్మిక్కేనని.. ఇబ్బందుల్లో ఉన్న కశ్మీరీలకు ఇది కంటితుడుపు చర్యేనని కాంగ్రెస్ విమర్శించింది. ప్రధాని ప్యాకేజీతో రాష్ట్రంలో రాజకీయ సమస్యకు పరిష్కారం దొరకదని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా విమర్శించారు. ప్రధాని శ్రీనగర్ పర్యటన పోలీసుల పహారాలోనే సాగింది. వేర్పాటువాదుల నిరసన నేపథ్యంలో షేర్-ఏ-కశ్మీరీ స్టేడియానికి గట్టి భద్రత ఏర్పాటుచేశారు.   

 వెయ్యి రోజుల్లో 18వేల గ్రామాలకు కరెంట్
 కశ్మీర్ పర్యటనకు ముందు జమ్మూలో ప్రధాని 450 మెగావాట్ల బాగ్లిహర్ పవర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. వెయ్యి రోజుల్లో దేశవ్యాప్తంగా 18వేల గ్రామాలకు విద్యుత్ వెలుగులు అందిస్తామని చెప్పారు. ఉధమ్‌పూర్-రాంబన్ నాలుగు లేన్ల రోడ్డుకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు.

 గిలానీ అరెస్టు.. మిలియన్ మార్చ్ విఫలం
 శ్రీనగర్‌లో ప్రధాని రాకను నిరసిస్తూ..  భారీ ర్యాలీ కి యత్నించిన వేర్పాటువాద నేత, హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ సయ్యద్ అలీషా గిలానీని పోలీసులు అరెస్టు చేశారు. మోదీ ర్యాలీకి వ్యతిరేకంగా ‘మిలియన్ మార్చ్’కు ఆయన పిలుపునిచ్చారు. కశ్మీరీలది ఆర్థిక సమస్య కాదని, రాజకీయ, మానవత్వ సమస్యని అన్నారు. ప్రధాని ర్యాలీ ఓ డ్రామా అని జేకేఎల్‌ఎఫ్ నేత యాసిన్ మాలిక్ విమర్శించారు.
 
ప్యాకేజీలో ఏ విభాగానికి ఎంతెంత? (రూ. కోట్లలో)
 
 గతేడాది వరద సహాయక చర్యలకు    7,854
 జమ్మూ-శ్రీనగర్ హైవే నిర్మాణం, రెండు టన్నెళ్లకు    42,611
 పర్యాటక రంగ అభివృద్ధి, 50 పర్యాటక గ్రామాల ఏర్పాటుకు    2,241
 విద్యుత్ రంగం, పునరుత్పాదక విద్యుదుత్పత్తికి    11,708
 జమ్మూ, శ్రీనగర్‌లలో ఎయిమ్స్ వంటి సంస్థల ఏర్పాటు,
 రాష్ట్ర వ్యాప్తంగా వైద్య రంగ అభివృద్ధికి    4,900
 మిగిలిన నిధులు వ్యవసాయం, చేతివృత్తులు, యువతకు
 ఉపాధి కల్పనతోపాటు వివిధ ప్రాజెక్టులకు కేటాయింపు

మరిన్ని వార్తలు