ఆ ప్రమాద బాధితులకు నష్టపరిహారాలు డబుల్

24 Dec, 2016 08:11 IST|Sakshi
ఆ ప్రమాద బాధితులకు నష్టపరిహారాలు డబుల్
న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థలో ఒకటైన రైల్వేలు తరుచూ ప్రమాదానికి గురవుతూ వందలమంది ప్రాణాలు బలిగొంటున్న సంగతి తెలిసిందే. నవంబర్లో కాన్పూర్ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో 143 మంది ప్రాణాలను కోల్పోగా, 200 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలకు నష్టపరిహారాలను రెట్టింపు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. 19 ఏళ్ల తర్వాత రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకు మరణించిన వ్యక్తి కుటుంబానికి అందే రూ.4 లక్షల నష్టపరిహారం ఇకనుంచి రూ.8 లక్షలుగా అందనుంది. 
 
అదేవిధంగా ప్రమాదంతో తీవ్రంగా గాయపడి చేయి, కాలు వంటి అవయవ భాగాలను పోగొట్టుకున్న వారికి నష్టపరిహారం రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెరిగింది. ఇతర 34 రకాల గాయాలకూ నష్టపరిహారం రూ.64,000 నుంచి రూ.7.2 లక్షలకు పెంచుతున్నట్టు రైల్వే శాఖ నిర్ణయించింది.  రైల్వే ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనల 1990 నిబంధనలకు సవరణలు చేసి ఈ నష్టపరిహారాలను రైల్వే శాఖ పెంచింది. ఈ రూల్స్కు చివరి సవరణ 1997లో జరిగింది. 
 
సవరణల ద్వారా రైల్వే శాఖ పెంచిన నష్టపరిహారాలు 2017 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.  1997లో నష్టపరిహారాలను నిర్ణయించిన రైల్వే శాఖ అప్పటినుంచి ఇప్పటివరకు ఎలాంటి మార్పులు చేయలేదు. రైల్వే ప్రమాదంలో మరణించే వారికి, గాయాలు పాలయ్యే వారికి నష్టపరిహారాలు పెంచాలని  2015లోనే ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల అనంతరం చాలా ప్రమాదాలే జరిగాయి. కానీ తాజాగా కాన్పూర్ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంతో రైల్వే శాఖ మేల్కొంది.
 
నష్టపరిహారాలను పెంచుతున్నట్టు తెలిపింది. దీంతో పాటు రైల్వే టిక్కెట్ కొనుగోలు చేసినప్పుడే ప్రయాణికులకు ఇన్సూరెన్స్ అందుతుంది. అనుకోని పరిస్థితుల్లో రైల్వే ప్రమాదానికి గురైతే ఈ బీమా కవరేజ్ కింద బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల వరకు నష్టపరిహారం అందిస్తారు. రైల్వే టిక్కెట్ కొనుగోలుచేసేటప్పుడు నామినీ పేర్కొంటేనే ఇన్నిరోజులు ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చేది. కానీ ప్రస్తుతం ఇన్సూరెన్స్ కవరేజ్ తప్పనిసరి చేసి, నామినీ లేకపోయినా బీమాను అందిస్తున్నారు.  
 
మరిన్ని వార్తలు