బీజేపీ తర్వాతి టార్గెట్ ఈ రాష్ట్రమే!

24 Mar, 2017 15:56 IST|Sakshi
బీజేపీ తర్వాతి టార్గెట్ ఈ రాష్ట్రమే!

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంతో పాటు గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకుని జోరు మీదున్న బీజేపీ.. ఈశాన్య భారత్ పై దృష్టి సారిస్తోంది. కమ్యూనిస్టుల ఏలుబడిలో ఉన్న త్రిపురను టార్గెట్ చేసింది. ఈశాన్య భారత్‌లో ఇప్పటికే అసోం, అరుణాచల్ ప్రదేశ్‌, మణిపూర్‌లలో కాషాయ జెండా ఎగురవేసిన కమలం పార్టీ.. ఇప్పుడు త్రిపురను సొంతం చేసుకోవాలని కలలు కంటోంది. వచ్చే ఏడాది జరిగే త్రిపుర ఎన్నికలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. అధికారంలోకి రాకపోయినా కనీసం కింగ్ మేకర్ అయినా కావాలని భావిస్తున్నారు.

త్రిపురలో ప్రస్తుతం సీపీఎం అధికారంలో ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ గత 19 ఏళ్లుగా వరుసగా ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఆయనకు ప్రజల్లో మంచి పేరు ఉంది. ఈ నేపథ్యంలో త్రిపురలో సీపీఎంను, మాణిక్ సర్కార్‌లను ఎదుర్కోవడం బీజేపీకి సవాలే. ఈ నేపథ్యంలో బీజేపీ తొలుత సీపీఎంను గాక ఇతర పార్టీలను బలహీనం చేసేందుకు ఎత్తుగడలు వేస్తోంది. ఇందులో భాగంగా తృణమూల్ కాంగ్రెస్‌ను టార్గెట్ చేసింది. 48 గంటల్లో త్రిపుర టీఎంసీ చీఫ్‌ రతన్ చక్రవర్తి సహా ఆ పార్టీకి చెందిన వందలాదిమంది నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు.

కాంగ్రెస్ నాయకులను ఆకర్షించేందుకు టీఎంసీ ప్రయత్నిస్తుండగా, టీఎంసీ నాయకులపై బీజేపీ వల వస్తోంది. ప్రత్యర్థి పార్టీ నాయకులను ఆకర్షించడంలో టీఎంసీతో పోలిస్తే బీజేపీయే జోరుమీదుంది. యూపీలాగే త్రిపుర ఎన్నికల్లోనూ బీజేపీ సునామీ సృష్టిస్తుందని కేంద్ర మంత్రి రాజెన్ గోహెయిన్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది త్రిపురతో పాటు ఈశాన్య రాష్ట్రాలు మేఘాలయా, నాగాలాండ్‌లలో కూడా ఎన్నికలు జరగాల్సివుంది.
 

మరిన్ని వార్తలు