భారత్లో అత్యధికంగా కాలుష్య మరణాలు

9 Sep, 2016 13:09 IST|Sakshi
భారత్లో అత్యధికంగా కాలుష్య మరణాలు
న్యూఢిల్లీ : గాలి కాలుష్యంతో అత్యధిక మరణాలు సంభవించే రెండో దేశం భారతేనట. చైనా తర్వాత ఈ మరణాలు ఎక్కువగా భారత్లోనే సంభవిస్తున్నాయని ప్రపంచ బ్యాంకు తాజా రిపోర్టులో వెల్లడైంది. 2013లో భారత్లో గాలి కాలుష్యంతో 1.4 మిలియన్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారని రిపోర్టు తెలిపింది. చైనాలో 1.6 మిలియన్ మంది ప్రజలు చనిపోయినట్టు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా గాలి కాలుష్యంతో వచ్చే ఆరోగ్య సమస్యలతో 5 మిలియన్ మందికి పైగా చనిపోతున్నారని రిపోర్టు వెల్లడించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ ముప్పు ఎక్కువగా ఉందని పేర్కొంది. ప్రపంచ బ్యాంకు, హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవల్యూషన్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా ఈ రిపోర్టు రూపొందించింది. 
 
గాలి కాలుష్య కారణంతో సంభవించే అకాల మరణాల వల్ల గ్లోబల్ ఎకానమీ వార్షికంగా 5.1 ట్రిలియన్ డాలర్ల వ్యయాలు భరించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేసింది. దేశాల ఎకానమిక్ డెవలప్మెంట్కు ఈ మరణాలు తీవ్ర షాకిస్తున్నాయని, ముఖ్యంగా ఆసియాలో అభివృద్ధి చెందుతున్న దేశాలు దీన్ని తీవ్రతను ఎక్కువగా ఎదుర్కొంటున్నాయని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. 2013లో చైనా తన జీడీపీలో 10 శాతం, ఇండియా 7 శాతం, శ్రీలంక 8 శాతం కోల్పోయినట్టు తెలిపింది. అబివృద్ధి చెందుతున్న దేశాల్లో గాలి కాలుష్యంతో ఆరోగ్య సమస్యల ఎక్కువగా ప్రబలుతున్నాయని రిపోర్టు వివరించింది. 90 శాతం జనాభాకు గాలి కాలుష్య ముప్పు డేంజరస్ లెవల్స్లో ఉన్నాయని హెచ్చరించింది. గాలికాలుష్యంతో గుండె నొప్పులు, గుండె సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఆస్తమా లాంటి దీర్ఘకాల శ్వాస సంబంధమైన సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది.   
మరిన్ని వార్తలు