జాతికి క్షమాపణ చెప్పండి : మోదుగుల

18 Feb, 2014 02:45 IST|Sakshi
జాతికి క్షమాపణ చెప్పండి : మోదుగుల

స్పీకర్ మీరాకుమార్‌కు మోదుగుల లేఖ
 సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలకు భిన్నంగా అధికార పార్టీ పక్షపాతిగా వ్యవహరిస్తున్న స్పీకర్ మీరాకుమార్ తన పదవి నుంచి తప్పుకుని జాతికి క్షమాపణ చెప్పాలని టీడీపీ సీమాంధ్ర ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన స్పీకర్‌కు మూడు లేఖలు పంపారు. ‘అవిశ్వాసంపై మేము పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పుడు.. సభ సజావుగా సాగడంలేదని స్పీకర్ అనుమతివ్వలేదు. మరి విభజన బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో సభ సజావుగా సాగుతుందా?’ అని మోదుగుల ప్రశ్నించారు.
 
 రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు న్యాయనిపుణుల సలహాను కోరిన రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ ప్రజాస్వామ్య విలువలను కాపాడారని గుర్తు చేస్తూ.. లోక్‌సభలో కనీస విలువలు పాటించలేదని స్పీకర్‌ను దుయ్యబట్టారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కోసం ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరించారని ఆరోపించారు. 13వ తేదీన లోక్‌సభలో తెలంగాణ బిల్లు పెట్టిన సమయంలో జరిగిన పరిణామాలపై సీసీటీవీ దృశ్యాలను బహిర్గతపర్చాలని డిమాండ్ చేశారు.
 
 శరద్ యాదవ్, తంబిదొరైలతో భేటీ
 తెలంగాణ ప్రాంత టీడీపీ నేత నామా నాగేశ్వరరావు నేతృత్వంలో ఆ ప్రాంత నేతల బృందం సోమవారం రాత్రి జేడీయూ అధినేత శరద్‌యాదవ్, ఏఐఏడీఎంకే నేత తంబిదొరైలను వేర్వేరుగా కలిసి పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేసింది. నామా వెంట టీడీపీ ఎంపీ రమేష్ రాథోడ్, ఆ పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ యర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు