తొలి వారంలో అసెంబ్లీ?

25 Nov, 2013 02:15 IST|Sakshi

న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ బిల్లును పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టే దిశగా ప్రయత్నాలను కేంద్రం ముమ్మరం చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా ఆదేశించడంతో అందుకు తగ్గట్లుగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా నవంబర్ 28న జరిగే కేంద్ర కేబినెట్ భేటీలో తెలంగాణ నోట్‌ను ఆమోదించి రాష్ట్రపతికి, అటునుంచి రాష్ట్ర శాసనసభకు పంపేలా పావులు కదుపుతున్నట్టు సమాచారం. అలాగే డిసెంబర్ 3 లేదా 4న శాసనసభను సమావేశపరిచేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి, శాసనసభ వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్‌బాబుకు కాంగ్రెస్ అధిష్టానం పెద్దల నుంచి సంకేతాలు వెళ్లినట్టు తెలుస్తోంది.
 
 రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని పైకి పదేపదే చెబుతున్న కిరణ్ అంతర్గతంగా మాత్రం అధిష్టానం ఆదేశాలను అమలు చేయడంలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన జరిగే కేంద్ర మంత్రివర్గ భేటీలో తెలంగాణ అంశం చర్చకు వచ్చే అవకాశాలు తక్కువేనని తెలిసింది. రాష్ట్ర విభజన విధి విధానాల ఖరారుకు ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) ఇప్పటిదాకా నివేదికను అధికారికంగా ఖరారు చేయకపోవడం తెలిసిందే. వచ్చే వారం సమావేశమై సాధ్యమైనంత తొందర్లో దాన్ని కేబినెట్‌కు సమర్పిస్తామని జీవోఎంకు సారథ్యం వహిస్తున్న కేంద్ర హోంమంత్రి షిండే చెప్పారు. అందులో భాగంగా 25-28 తేదీల మధ్యలో రెండుసార్లు సమావేశమై నివేదికను ఖరారు చేసేందుకు జీవోఎం సభ్యులు సిద్ధమవుతున్నారు. కాబట్టి సోమవారం నాటి కేబినెట్ భేటీలో జీవోఎం నివేదిక సమర్పణ ఉండదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 28న జరిగే కేబినెట్ సమావేశంలో తెలంగాణ అంశం కీలకం కానుందని కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి రాజధాని, 371(డి) వంటి అంశాలపై ఈ లోపే న్యాయ కోవిదుల సలహాలు, సంప్రదింపుల ప్రక్రియను పూర్తి చేసేందుకు కేంద్ర న్యాయ మంత్రి కపిల్ సిబల్ సిద్ధమయ్యారు.
 
 ‘మెజారిటీ’ ఏమంటారో?
 
 తెలంగాణ బిల్లు త్వరలో అసెంబ్లీకి రానున్నందున సభలో ఏం జరగనుందన్నది ఆసక్తికరంగా మారింది. సంఖ్యాబలం రీత్యా సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నందున విభజనకు వ్యతిరేకంగా అభిప్రాయాలు వెల్లడి కావచ్చంటున్నారు. అసెంబ్లీలో మెజారిటీ అభిప్రాయాలు విభజనకు వ్యతిరేకంగా వ్యక్తమైతే బిల్లును పార్లమెంటుకు పంపటంపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పునరాలోచనలో పడవచ్చని అధిష్టానం పెద్దలు భావిస్తున్నారు. రాష్ట్రపతిపై ఒత్తిడి తెచ్చినా, పార్లమెంటులో మాత్రం బిల్లుపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు తప్పకపోవచ్చంటున్నారు. కాబట్టి అటు రాష్ట్రపతికి ఇబ్బంది కలగకుండా, ఇటు పార్లమెంటులోనూ బిల్లు ఆమోద ప్రక్రియ సజావుగా సాగేలా పావులు కదుపుతున్నారు.
 
 సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపైకి ‘విభజించు-పాలించు’ అస్త్రాన్ని అధిష్టానం ప్రయోగిస్తోంది. విభజన బిల్లును కిరణ్ గట్టిగా వ్యతిరేకించడం వెనక కూడా హస్తిన ప్లానే దాగుందని పార్టీ వర్గాలంటున్నాయి. ఆయనతో గళం కలిపే వారి సంఖ్య ఏ మేరకుందో చూసి, తగిన ప్రణాళిక రూపొందించుకోవచ్చనేది అధిష్టానం గేమ్ ప్లాన్. ప్రస్తుతం రాష్ట కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో సీఎం అనుకూలుర సంఖ్య చాలా తక్కువ. సీఎంను వ్యతిరేకిస్తున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉన్నప్పటికీ వారిలో కొందరు సమైక్యవాదాన్ని గట్టిగా విన్పిస్తున్నందున వాళ్లను కూడా దారిలోకి తెచ్చుకునే పనిలో పడింది. పీసీసీ అధ్యక్షుడు బొత్స అదే పనిలో నిమగ్నమైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
 
 అధిష్టానం నిర్ణయానికి కట్టుబడితేనే భవిష్యత్ ఉంటుందని, లేదంటే ఇబ్బందులు తప్పవని నేతలకు ఆయన నచ్చజెబుతున్నారు. విభజన అనంతరం సీమాంధ్రలో కాపు సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తామని సంకేతాలు పంపడం ద్వారా ఆ వర్గ మంత్రులు, ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడంలో బొత్స దాదాపుగా విజయం సాధించినట్టు తెలుస్తోంది. రాయల తెలంగాణ అంశాన్ని కూడా సజీవంగా ఉంచాలని అధిష్టానం భావిస్తోంది. కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వేదికగా రాష్ట్ర విభజనకు సానుకూలత వ్యక్తం చేయడంతో పాటు, తమ జిల్లాలను తెలంగాణలో కలపాలని కోరేలా వ్యూహం రూపొందిస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే అసెంబ్లీలోనూ మెజారిటీ అభిప్రాయాలు తెలంగాణకు అనుకూలంగా వెల్లడి కావడం ఖాయమని ఏఐసీసీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
 

>
మరిన్ని వార్తలు