పథకం ప్రకారమే స్టాలిన్‌పై దాడి?

19 Feb, 2017 23:00 IST|Sakshi
పథకం ప్రకారమే స్టాలిన్‌పై దాడి?

- వెలుగులోకి వాస్తవాలు
- దాడికి నిరసనగా డీఎంకే దీక్షలు
- రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్న స్టాలిన్‌


సాక్షి, చెన్నై:
డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌పై ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా దాడి చేయించిందా? ఈ ప్రశ్నకు డీఎంకే నాయకులు అవుననే అంటున్నారు. మార్షల్స్‌ ముసుగులో నిబంధనలు ఉల్లంఘించి తొమ్మిది మంది ఐపీఎస్‌లు తమిళనాడు అసెంబ్లీలోకి అడుగు పెట్టడమే ఇందుకు బలమైన రుజువని చెబుతున్నారు. సభా నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎస్‌లను రంగంలోకి దించి, పథకం ప్రకారం ప్రధాన ప్రతి పక్ష నేత స్టాలిన్‌పై దాడి చేయించారన్న ఆరోపణలకు బలం చేకూరే ఆధారాలు దొరికినట్టు సమాచారం. గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు ఆదేశాల మేరకు సాగిన విచారణలో ఆ తొమ్మిది మంది ఐపీఎస్‌లను గుర్తించినట్టు తెలిసింది. ఈ విషయమై స్టాలిన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్‌ విచారణకు ఆదేశించినట్టు సమాచారం.

సభలో స్పీకర్‌ కూడా లేని సమయంలో చొరబడ్డ ఆ అధికారులు బలవంతంగా స్టాలిన్‌ను బయటకు ఎత్తుకెళ్లినట్టు ఆధారాలు బయట పడ్డాయి.  శ్రీధర్, సంతోష్‌కుమార్, జోషి నిర్మల్‌ కుమార్, ఆర్‌ సుధాకర్, రవి, గోవిందరాజ్, ముత్తలగు, శివ భాస్కర్, దేవరాజ్‌ అనే ఐపీఎస్‌లు సభలోకి వచ్చినట్టు గుర్తించారు. జల్లికట్టు ఉద్యమంలో సాగిన అల్లర్ల వ్యవహారంలో వీరిపై పలు ఆరోపణలు ఉన్నాయి. సభలో సాగుతున్న గందరగోళం మేరకు ఆగమేఘాలపై ఐపీఎస్‌లను రంగంలోకి దించాల్సి వచ్చినట్టు అసెంబ్లీ కార్యదర్శి వివరణ ఇచ్చారు. అయితే, హఠాత్తుగా ఐపీఎస్‌లకు మార్షల్స్‌ యూనిఫారాలు ఎక్కడి నుంచి వచ్చాయని, సభలో స్పీకర్‌ లేని సమయంలో ఎలా మార్షల్స్‌ ముసుగులో ఆ అధికారులు ప్రవేశించారని డీఎంకే ప్రశ్నించింది. దీంతో ఈ తొమ్మిది మంది మెడకు నిబంధనల ఉల్లంఘన వ్యవహారం చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

22న డీఎంకే దీక్షలు
స్టాలిన్‌కు జరిగిన అవమానంపై డీఎంకే వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తనను బలవంతంగా ఎత్తుకు వచ్చి, దాడి చేశారని స్టాలిన్‌ ప్రకటించారు. దీంతో ప్రభుత్వంపై పోరాటానికి డీఎంకే శ్రేణులు సిద్ధమయ్యాయి. దూకుడు ప్రదర్శించి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని స్టాలిన్‌ నిర్ణయించారు. ఆదివారం తేనాంపేటలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో స్టాలిన్‌ సమావేశం అయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చలు జరిపారు. దాడికి నిరసనగా ఈనెల 22న అన్ని జిల్లా కేంద్రాల్లో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిరసన దీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. తిరుచ్చిలో జరిగే దీక్షకు స్టాలిన్‌ నేతృత్వం వహించనున్నారు. అలాగే రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి ఫిర్యాదు చేసేందుకు కూడా అనుమతి కోరనున్నామని స్టాలిన్‌ తెలిపారు. దీక్షకు డీఎంకే సిద్ధం అవుతోంటే, మెరీనా తీరంలో నిషేదాజ్ఞల్ని ఉల్లంఘించి ఆందోళన నిర్వహించారని పేర్కొంటూ, స్టాలిన్, ఇద్దరు ఎంపీలు, 69 మంది డీఎంకే ఎమ్మెల్యేలపై అక్కడి పోలీసులు కేసులు నమోదు చేశారు.

గవర్నర్‌ వద్ద పంచాయితీ
- అసెంబ్లీని రద్దు చేయాలన్న డీఎంకే
- సభలో పరిస్థితులను వివరించిన స్వామి
చెన్నై:
తమిళనాడు రాజకీయ సంక్షోభానికి తెరపడినా.. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోరాటాన్ని  కొనసాగిస్తున్నాయి. ఆదివారం ఇరు పార్టీల నాయకులు గవర్నర్‌ విద్యాసాగర్‌ రావును కలసి ఒకరిపై మ రొకరు ఫిర్యాదు చేసుకున్నారు. ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీలో జరిగిన పరిణామాలను వివరించారు. కాసేపటి తర్వాత డీఎంకే ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలసి అధికార పార్టీ తీరుపై ఫిర్యాదు చేసింది. అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్యెల్యేలపై జరిగిన దౌర్జన్యంపై గవర్నర్‌కు వినతిపత్రం అందజేశామని, పరి శీలిస్తానని ఆయన హామీ ఇచ్చారని డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ చెప్పారు. ప్రతిపక్ష పార్టీలను బయటకు గెంటి బలపరీక్షలో ముఖ్యమంత్రి గెలవడం చట్టవిరుద్ధమని అన్నారు.

శాసనసభలో శనివారం జరిగిన కార్యకలాపాలను రద్దు చేయాలని డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎంకే స్టాలిన్‌ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాల సభ్యులు లేకుండానే విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారని సభలో విపక్ష నాయకుడు కూడా అయిన ఆయన పేర్కొన్నారు. శనివారం తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష సందర్బంగా రణరంగాన్ని తలపించిన సంగతి తెలిసిందే. డీఎంకే సభ్యులు కుర్చీలు, మైకులు విరగ్గొట్టి స్పీకర్‌ ధనపాల్‌పై విసిరివేశారు. సభ రెండుసార్లు వాయిదా పడిన అనంతరం స్పీకర్‌ డీఎంకే ఎమ్మెల్యేలను బయటకి పంపి ఓటింగ్‌ ప్రక్రియను పూ ర్తి చేశారు. ఇదిలా ఉంటే స్వామిని బలపర్చినందుకు తనకు బెది రింపులు వస్తున్నాయని కోయంబత్తూరు ఎమ్మెల్యే అమ్మన్‌ అర్జునన్‌ ఆరోపించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి దుర్భాషలాడారని చెప్పారు.

వికీపిడియాలో 'పళనిస్వామి: శశికళ బానిస'
ప్రజా మద్దతుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి పేరు వికీపీడియాలో మారిపోయింది. పళనిస్వామి పేరును కొట్టేసి ఆ స్థానంలో ‘శశికళ బానిస’ అని రాశారు. శశికళకు వ్యతిరేకంగా పన్నీర్‌ సెల్వం గళమెత్తడంతో అన్నాడీఎంకేలో మొదలైన ఆధిపత్య పోరులో చివరికి చివరికి నాటకీయ పరిణామాల మధ్య పళనిస్వామి గద్దెనెక్కారు. సుప్రీంకోర్టు తీర్పుతో శశికళ, ఇళవరసి, సుధాకరన్‌ జైలుకు వెళ్లారు. అయితే శశికళ మద్దతుదారుడైన పళనిస్వామి ముఖ్యమంత్రి పీఠం ఎక్కడాన్ని జీర్ణించుకోలేని కొందరు వికీపీడియాలో ఆయన పేరును శశికళ బానిస అని మార్చేసి తమ కోపాన్ని చల్లార్చుకున్నారు. ఫిబ్రవరి 16నే దీనిని ఎడిట్‌ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు ఆ పేరును సరిచేశారు.

ఇది మాఫియా సర్కార్‌: కమల్‌ హాసన్‌
పళనిస్వామి ప్రభుత్వంపై ప్రముఖ హీరో కమల్‌హాసన్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ప్రస్తుతం తమిళనాడులో ఏర్పాటైన ప్రభుత్వానికి, నేరగాళ్ల గ్యాంగ్‌నకు పెద్ద తేడా ఏమీ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో శనివారం నాటి పరిణామాలను, సభ జరిగిన తీరును తనతో సహా ప్రజలు ఎవరూ అంగీకరించడం లేదన్నారు. జైలులో ఉన్న శశికళ ఎంచుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి కావడం బాధాకరమన్నారు. తమిళ అసెంబ్లీని శుద్ధి చేయాల్సిన సమయం ఆసన్నమైందని, దానిని మనమే శుద్ధి చేయాలని పిలుపునిచ్చారు. తన రాజకీయ అరంగేట్రంపై మరోమారు స్పందించిన కమల్‌ తాను రాజకీయాలకు పనికిరానని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు