ఏ తండ్రి చేయకూడని పని చేశాడు!

23 Jun, 2016 16:59 IST|Sakshi
ఏ తండ్రి చేయకూడని పని చేశాడు!

కనురెప్పే కనుపాపను కాటేసినరీతిలో ఓ తండ్రి దుర్మార్గానికి పాల్పడ్డాడు. 13 ఏళ్ల తన కూతురిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా గుర్తుతెలియని వారితోనూ బాలికపై అత్యాచారం చేయించి.. ఆ దుర్మార్గాన్ని స్వయంగా వీక్షించాడు. కన్నబిడ్డపై కనీవినీ ఎరుగని ఉన్మాదానికి పాల్పడిన ఆ కామాంధుడికి ఆస్ట్రేలియా కోర్టు ఇరవై రెండున్నరేళ్ల జైలుశిక్ష విధించింది. బిడ్డపై అత్యాచారం చేయడమే కాకుండా ఇతరులతోనూ లైంగిక దాడులు చేయించి.. వీడియో తీయించిన ఆ కిరాతకుడు ఇలా చేయడం తనకు వినోదాన్ని పంచిందంటూ పోలీసుల విచారణలో తన వికృతస్వరూపాన్ని బయటపెట్టుకున్నాడు.

పోలీసుల విచారణలో ఆ నీచుడు తనపై పోలీసులు మోపిన 61 అభియోగాలను ఒప్పుకున్నాడు. 2013-15 మధ్యకాలంలో 11 నుంచి 13 ఏళ్ల మధ్య వయస్సున్న తన కూతురిపై ఈ వికృతానికి పాల్పడినట్టు అంగీకరించాడు. బాధితురాలి పేరు రహస్యంగా ఉంచే ఉద్దేశంతో నిందితుడి పేరును పోలీసులు వెల్లడించలేదు. ఈ కేసును విచారించిన పెర్త్ లోని వెస్ట్ ఆస్ట్రేలియన్ జిల్లా కోర్టు.. 42 ఏళ్ల నిందితుడితోపాటు.. బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఆరుగురు వ్యక్తులకు శిక్ష విధించింది.

ఆన్‍లైన్ లో పరిచయమైన ఆరుగురు వ్యక్తులతో అతడు బాలికపై లైంగిక దాడులు చేయించి.. ఆ దుర్మార్గాన్ని వీడియోలో చిత్రించాడు. తల్లిదండ్రులు వేరవ్వడంతో బాలిక తండ్రి వద్ద ఉండిపోయింది. ఆమె సంరక్షణ చూసుకోవాల్సిన తండ్రి కంచే చేను మేసినట్టు ఇంతటి దుర్మార్గానికి పాల్పడ్డాడని జడ్జి పేర్కొన్నారు. తండ్రితో ఆన్‍ లైన్ లో పరిచయం చేసుకొని బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టిన కామాంధుల్లో ఓ చర్చి పాస్టర్ కూడా ఉన్నాడు. అతనికి కోర్టు పదేళ్ల జైలుశిక్ష విధించింది.

మరిన్ని వార్తలు