ఆరోగ్యాన్ని బ్యాంకులో పెడదామా?

10 Nov, 2013 00:47 IST|Sakshi
ఆరోగ్యాన్ని బ్యాంకులో పెడదామా?

బ్యాంకంటే ఒక ఖాతా. డబ్బులు వెయ్యటం. అవసరమైనపుడు తియ్యటం. అవసరాన్ని బట్టి చెక్కులివ్వటం.. డ్రాఫ్టు తీసుకోవటం. చాలాకాలం వరకూ ఇంతే! కానీ ప్రైవేటు బ్యాంకులొచ్చాయి. పోటీ పెరిగింది. సేవలూ పెరిగాయి. అవి ఇపుడు ఏ స్థాయికొచ్చాయంటే... తమ ఖాతాదార్లకు ఆరోగ్య బీమా కూడా అందిస్తున్నాయి. తక్కువ ప్రీమియంతోనే పాలసీలు అందిస్తున్నాయి. మీ డబ్బునే కాదు... మీ ఆరోగ్యాన్ని కూడా మా దగ్గర భద్రంగా దాచుకోండంటున్నాయి. నిజంగా ఇలా బ్యాంకులిచ్చే ఆరోగ్య బీమా పాలసీల్లో ప్రయోజనముందా? ఉంటే ఎంత? ఏ బ్యాంకులు తక్కువ ధరకు పాలసీలిస్తున్నాయి? ఇదే ఈ వారం ‘ప్రాఫిట్’ ప్రధాన కథనం..
 
 ఏటా వైద్య చికిత్స వ్యయం విపరీతంగా పెరుగుతోంది. దీనికితోడు మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల వల్ల కొత్త కొత్త వ్యాధులతో పాటు అంతుపట్టని వ్యాధులూ వస్తూ... ఆరోగ్య బీమాను తప్పనిసరి చేస్తున్నాయి. వైద్యానికయ్యే ఖర్చును జేబులోంచి పెట్టడం ఎగువ మధ్య తరగతి వారికి కూడా అసాధ్యమవుతోంది కనక వైద్య బీమా తప్పనిసరే! మరి చాలా కంపెనీలు పాలసీలిస్తున్నాయి కదా? ఏది మంచిది? ఈ ఎంపిక కస్టమర్లకు కష్టమే. అయితే ప్రభుత్వ సంస్థలు కూడా బీమా పథకాలు అందిస్తున్నప్పటికీ ప్రైవేటు బీమా కంపెనీల పాలసీలే ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటన్నిటి కంటే బ్యాంకుల నుంచి తీసుకుంటే ప్రీమియం భారం తగ్గుతుంది. ఈ మేరకు బ్యాంకులు- బీమా సంస్థలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి.
 బ్యాంకుల్లోనే ఎందుకు?
 సాధారణంగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటపుడు కంపెనీలు వయసు, వైద్య పరీక్షలు వంటి సవాలక్ష నిబంధనలు పెడతాయి. బ్యాంకుల్లో ఇవేమీ లేకుండా చాలా ఈజీగా పాలసీ తీసుకోవచ్చు. దీనికి ఉండాల్సిన అర్హత ఒక్కటే... సదరు బ్యాంకులో ఖాతా ఉండటం. ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేకుండానే పాలసీ ఇచ్చేస్తారు. అంతేకాక బయట తీసుకునే కంటే ప్రీమియం చాలా తక్కువ. ఉదాహరణకు ప్రైవేటు రంగ బీమా కంపెనీలో రూ.3 లక్షల బీమా మొత్తానికి ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ (భార్యాభర్తలు+ ఇద్దరు పిల్లలు) తీసుకుంటే ఏటా సుమారు రూ.11,390 (ఎటువంటి పరిమితులు లేకుండా) ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అదే మీరు పంజాబ్ నేషనల్ బ్యాంకులో అయితే కేవలం రూ.4,536 చెల్లిస్తే చాలు. చాలా బ్యాంకులు వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికీ ఒకే విధమైన ప్రీమియం వసూలు చేస్తున్నాయి. దీంతో గరిష్ట వయసులో ఉన్న వారికి కూడా తక్కువ రేటుకే పాలసీ లభిస్తోంది. అంతే కాక వయసు పెరుగుతున్నా ప్రీమియం పెరక్కపోవడం మరో ప్రత్యేక ఆకర్షణ. ఇందుకు కార్పొరేషన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు మినహాయింపు. ఈ రెండు బ్యాంకులు వయసు ఆధారంగా ప్రీమియం నిర్ణయిస్తున్నాయి. చాలా బ్యాంకులు మూడు నెలల కనిష్ట వయసు నుంచి గరిష్టంగా 60-65 ఏళ్ల వారి వరకు ఈ పాలసీలను అందిస్తున్నాయి. ఇండియన్ బ్యాంక్ అయితే ఏకంగా 80 ఏళ్ల వారిక్కూడా ఈ పాలసీ అందిస్తోంది. వివిధ బ్యాంకులు అందిస్తున్న వైద్య బీమా పథకాల వివరాలను పట్టికలో చూడొచ్చు.
 తల్లిదండ్రులకు కూడా...
 కొన్ని బ్యాంకులు కేవలం కుటుంబసభ్యులకే అందిస్తుంటే మరికొన్ని అదనపు ప్రీమియం చెల్లిస్తే తల్లిదండ్రులకు కూడా బీమా రక్షణను కల్పిస్తున్నాయి.  ఆంధ్రాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సిండికేట్ బ్యాంకులు ఇలా తల్లిదండ్రులకు కూడా వైద్య బీమా రక్షణను అందిస్తున్నాయి. నేరుగా బీమా కంపెనీల నుంచి తీసుకునే వాటికంటే బ్యాంకుల ద్వారా తల్లిదండ్రులకు తీసుకునే పాలసీలపై ప్రీమియం చాలా తక్కువ. ఉదాహరణకు సిండికేట్ బ్యాంకులో మూడు లక్షల మొత్తానికి తల్లిదండ్రులతో కలిసి అంటే ఆరుగురు సభ్యుల(భార్య భర్త, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు)కు కలిపి పాలసీ తీసుకుంటే కేవలం రూ.8,210 చెల్లిస్తే చాలు. అదే నేరుగా కంపెనీ నుంచి తీసుకుంటే దీనికి రెండు నుంచి మూడు రెట్లు అధిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
 చూడాల్సినవి..
 చాలా బ్యాంకుల ప్రీమియంలు కాస్త అటూఇటుగా ఒకేలా ఉన్నప్పటికీ కొన్ని బ్యాంకుల్లో మాత్రం ప్రీమియం అధికంగా ఉంది. ముఖ్యంగా ఆంధ్రాబ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుల్లో ప్రీమియంలు అధికంగానే ఉన్నాయి. పాలసీ తీసుకునేటప్పటికి ఉన్న వ్యాధులకు సంబంధించి (ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్) ఏ నిబంధనలున్నాయో?  క్లెయిమ్‌లలో ఏమైనా సబ్‌లిమిట్స్ ఉన్నాయా? అన్న విషయాలు పరిశీలించడం మర్చిపోవద్దు. దీంతోపాటు బ్యాంకు ఒప్పందం కుదుర్చుకున్న  బీమా కంపెనీ క్లెయిమ్ సెటిల్‌మెంట్లు ఎలా ఉన్నాయన్నది కూడా చూడాలి.
 లోపాలు...
 బ్యాంకులు పాలసీలను విక్రయించడంపై చూపిస్తున్న ఆసక్తి క్లెయిమ్ వస్తే తగిన సేవలందించడంపై మాత్రం చూపించడం లేదన్న మాట వినిపిస్తోంది. సదరు సేవల కోసం పాలసీదారులు నేరుగా బీమా కంపెనీలు లేదా థర్డ్ పార్టీపై ఆధారపడాలి. అలాగే ఒకవేళ బ్యాంకుకి, బీమా కంపెనీకి మధ్య ఒప్పందం ఆగిపోతే... ఆ మరుసటి ఏడాది నుంచి పాలసీ తీసుకునే అవకాశం ఉండదు. అప్పటికే పాలసీ తీసుకొని ఉంటే మాత్రం ఆ పాలసీ గడువు ముగిసే వరకు బీమా రక్షణ ఉంటుంది. చాలా బ్యాంకులు గరిష్టంగా రూ.5 లక్షలకు మించి పాలసీని ఇవ్వడం లేదు. దీంతో అధిక మొత్తంలో పాలసీ తీసుకోవాలనుకునే వారికి ఇవి అనువుగా ఉండవు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రీమియం నిర్ణయించడం వలన చిన్న వయసులో ఉన్న వారు, సింగిల్‌గా తీసుకోవాలంటే అధిక మొత్తం చెల్లించాల్సి వస్తోంది.

మరిన్ని వార్తలు