ఇక టీవీలూ, గీజర్లకూ రేటింగ్

22 Aug, 2013 03:00 IST|Sakshi

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విద్యుత్ వాడకం ఆధారంగా ఇచ్చే స్టార్ రేటింగ్‌ను ఇక నుంచి టీవీలు, గీజర్లకు తప్పనిసరి చేయనున్నట్టు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ(బీఈఈ) తెలిపింది. విద్యుత్ వాడకాన్ని బట్టి వీటికి 1 నుంచి 5 వరకు బీఈఈ స్టార్ రేటింగ్ ఉంటుంది. ప్రస్తుతం స్వచ్ఛంద రేటింగ్ జాబితాలో ఉన్న టీవీలు, గీజర్లు 2014 జనవరి 1 నుంచి తప్పనిసరి రేటింగ్ జాబితా  కిందకు వెళ్తాయి. తద్వారా ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల సరసన చేరతాయి.   
 
 స్టార్ ఏసీ కనుమరుగు..
 2014 జనవరి 1 నుంచి స్టార్ రేటింగ్‌ను కఠినతరం చేయనున్నట్టు బీఈఈ డెరైక్టర్ జనరల్ అజయ్ మాథుర్ తెలిపారు. బుధవారమిక్కడ సీఐఐ 12వ ఎనర్జీ ఎఫీషియెన్సీ సమ్మిట్-2013లో పాల్గొన్న ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. ‘ఏసీలు, రిఫ్రిజిరేటర్ల ప్రస్తుత రేటింగ్‌ను మారుస్తాం. అంటే 5 స్టార్ 4 స్టార్ అవుతుంది. 4 స్టార్ 3 స్టార్ అవుతుంది. ఈ విధానంలో ప్రస్తుత 1 స్టార్ ఏసీలు కనుమరుగవుతాయి. అలాగే 5 స్టార్ ఉపకరణం మరింత సమర్థవంతంగా పనిచేసి అతి తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది’ అని తెలిపారు. అయితే ఉత్పత్తుల ధరలు పెరగడానికి రేటింగ్ ఒక్కటే కారణం కాదు. ముడిసరుకు ధర పెరగడం, రూపాయి పతనం కూడా కారణమని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్‌ను ఆదా చేసే పరిజ్ఞానం అభివృద్ధికి పరిశోధనా సంస్థలకు, కంపెనీలకు రుణ సహాయం చేసే అంశంపై కేంద్ర ఆర్థిక శాఖతో చర్చిస్తున్నట్టు ఈ సందర్భంగా ఆయన చెప్పారు.
 

>
మరిన్ని వార్తలు