బీజేపీని ఇరకాటంలో పెడుతుందా?

26 Feb, 2017 13:12 IST|Sakshi
బీజేపీని ఇరకాటంలో పెడుతుందా?

ముంబై: బృహన్‌ ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) మేయర్‌ పదవి శివసేనకు దక్కేలా కాంగ్రెస్‌ మద్దతు ఇవ్వాలనుకోవడంపై ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీని ఇరకాటంలో పెట్టడానికి ఇది మంచి అవకాశమని కొందరు అంటుంటే.. ఎన్నికల్లో బీజేపీ, శివసేన రెండింటిపై కాంగ్రెస్‌ పోటీ చేసిందనీ, ఎన్నికల అనంతరం శివసేనకు మద్దతు ఇవ్వడం నైతికత కాదని మరి కొందరు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గురుదాస్‌ కామత్‌ మాట్లాడుతూ ‘శివసేనకు పరోక్ష మద్దతు లేదా ఎలాంటి సాయాన్నైనా చేసేందుకు నేను పూర్తి వ్యతిరేకం. దీని గురించి నా అభిప్రాయాన్ని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి చెబుతాను’అని అన్నారు. పార్టీ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు అశోక్‌ చవాన్‌ మాత్రం బీజేపీ ప్రభుత్వంతో శివసేన తెగతెంపులు చేసుకుంటే తర్వాత ఆలోచిస్తామని శుక్రవారం సంకేతాలిచ్చారు. ఏది ఏమైనా నిర్ణయం మాత్రం తమ పార్టీ అధిష్టానానిదే అని, రాష్ట్ర స్థాయిలో దీనిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోమని కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు.

మొత్తం 227 వార్డులున్న ముంబై మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో శివసేన 84, బీజేపీ 82, కాంగ్రెస్‌ 31 సీట్లతో తొలి మూడు స్థానాల్లో నిలవడం తెలిసిందే. ఎన్నికల్లో గెలిచిన మరో ముగ్గురు శివసేన తిరుగుబాటు అభ్యర్థులు కూడా తిరిగి పార్టీ గూటికి చేరటంతో శివసేన బలం 87కు పెరిగింది. కానీ మేయర్‌ పీఠం దక్కించుకోవడానికి కనీసం 114 మంది కార్పొరేటర్లు అవసరమైనందున, శివసేకు మద్దతిచ్చి రాష్ట్రంలో బీజీపీని ఇబ్బందుల్లోకి నెట్టాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. 

మరిన్ని వార్తలు