బందోబస్తుకొస్తే అన్నీ బాధలే..!

4 Sep, 2014 22:53 IST|Sakshi

దాదర్, న్యూస్‌లైన్: ‘గణపతి ఉత్సవాల బందోబస్తు నిమిత్తం నగరానికి వస్తే, ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. పగలంతా డ్యూటీ..రాత్రి పూట దోమలు బెడద. క్రీమ్‌లు, మస్కిటో కాయిల్, నెట్‌లకు  తమ సొంత డబ్బులు వెచ్చిస్తున్నాం.  వర్షం వస్తే నీరంతా గది లోపలికి వస్తోంది. ఆ రాత్రంతా నిద్ర ఉండదు, లగేజీలకు భద్రతల లేదు. వంద గొడుగులు అందించాలని నగర పోలీసు అధికారులకు మొరపెట్టుకొన్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు ఒక్క గొడుగు అందజేయలేదు’అని గుజరాత్ బీఎస్‌ఎఫ్ జవాన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 అరకొర సౌకర్యాలు


 ముంబైలోని ప్రసిద్ధ లాల్‌బాగ్ చా రాజా గణేషుడి బందోబస్తులో పాల్గొన్నగుజరాత్‌కు చెందిన బార్డర్ సెక్యురిటీ ఫోర్స్  (బీఎస్‌ఎఫ్) జవాన ్లకు నగర పోలీసుల ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో ఈ దుస్థితి దాపురించింది. భక్తులకు భద్రతను అందించేందుకు దాదాపు 200 మంది జవాన్లు అరకొర సౌకర్యాల మధ్య ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. పరేల్ లోని బృహన్‌ముంబై మున్సిపల్ పాఠశాలను వీరికి కేటాయించారు. పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. గదులు చిన్నపాటి వర్షం వచ్చినా కురుస్తున్నాయి. దోమల బెడద తీవ్రంగా ఉండడంతో  ఫ్లోర్‌పై నిద్ర పోవాల్సి వస్తుంద ని, తరచూ అనారోగ్యానికి గురవుతున్నామని జవాన్లు వాపోతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు మాత్రం వీరి గురించి ఆలోచించిన పాపాన పోలేదు. డ్యూటీ అయిపోయి గుడారానికి వస్తే అక్కడా అసౌకర్యాలతో అవస్థలు తప్పడం లేదని జవాన్లు వాపోతున్నారు.

 సమస్య పరిష్కారానికి కృషి : డీసీపీ


 ముంబై పోలీస్ అధికార ప్రతినిధి, డీసీపీ ధనుంజయ్ కులకర్ణి మాట్లాడుతూ..సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, ఈవిషయమై ఉన్నతాధికారులతో మాట్లాడుతానని చెప్పారు.  ఈ అంశాన్ని తక్షణమే పరిశీలించి, ఇందుకు సంబంధించిన చర్యలు చేపడుతామని లాల్‌బాగ్‌చ రాజా వద్ద భద్రతను పరిశీలిస్తున్న డీసీపీ అశోక్ డుధే తెలిపారు.

మరిన్ని వార్తలు