రాజ్యసభలో చెప్పినట్లే మాయావతి సంచలన నిర్ణయం

18 Jul, 2017 18:27 IST|Sakshi
రాజీనామా చేసిన మాయావతి

- ‘దళితులపై దాడులు’ అంశంపై మాట్లాడనీయనందుకు నిరసన
- సభలో ప్రకటించినట్లే సంచలన నిర్ణయం తీసుకున్న బీఎస్పీ అధినేత్రి


న్యూఢిల్లీ:
ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన రాజ్యసభ సభ్యత్వానికి ఆమె మంగళవారం రాజీనామా చేశారు. దళితులపై దాడుల అంశంపై తనకు మాట్లాడే అవకాశం కల్పించనందుకు నిరసనగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.

రాజ్యసభ చైర్మన్‌కు లేఖ పంపిన అనంతరం మాయవతి మీడియాతో మాట్లాడారు. ‘దేశంలో నెలకొన్న అతిప్రధాన సమస్యపై సభలో మాట్లాడే అవకాశం ఇవ్వనప్పుడు అక్కడ ఉండే కంటే రాజీనామా చేయడమే ఉత్తమమని భావించా. అందుకే రాజీనామా చేశా’అని వివరించారు.

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో రెండోరోజైన మంగళవారం, రాజ్యసభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. కాంగ్రెస్‌ పార్టీ రైతుల అంశంపై, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ భారత్‌-చైనా ప్రతిష్టంభనపై వాయిదా తీర్మానాలు ఇవ్వగా, బీఎస్పీ అధినేత్రి మాయావతి.. ఉత్తరప్రదేశ్‌ షహరాన్‌పూర్‌లో దళితులపై దాడి అంశాన్ని లేవనెత్తారు. ఆమె మాట్లాడుతుండగా సభాపతి అడ్డుపడటంతో మాయావతి ఒకింత ఆగ్రహానికిలోనయ్యారు.

’మాట్లాడటానికి అవకాశం కల్పించకపోతే తక్షణమే రాజీనామా చేస్తా..’అని ఆవేశపూరితంగా ప్రకటించి, సభ నుంచి వాకౌట్‌ చేశారు.  కాగా, సభాపతిని అవమానించేలా మాయవతి ప్రవర్తించారని, ఇందుకుగానూ ఆమె క్షమాపణలు చెప్పాలని అధికార బీజేపీ డిమాండ్‌ చేసింది.

మరిన్ని వార్తలు