ఇక బైపాస్ సర్జరీకి బై బై!

7 Oct, 2015 03:21 IST|Sakshi
ఇక బైపాస్ సర్జరీకి బై బై!

గుండె రంధ్రాలకు మాసికతో అతుకు: పరిశోధనలో శాస్త్రవేత్తల విజయం
 
♦ ప్రత్యేక కాథెటర్ ద్వారా ఐదు నిమిషాల్లో చికిత్స పూర్తి  
♦ ఓపెన్ హార్ట్ సర్జరీ, గుండెకు కుట్లు అవసరమే లేదు
 
 వాషింగ్టన్: గుండెలో రంధ్రాలను నయం చేయటానికి గుండెను తెరిచి శస్త్రచికిత్స (బైపాస్ సర్జరీ) చేసే అవసరం లేకుండా.. అతుకువేయటం ద్వారా వాటిని మూసివేసే ప్రత్యేక కాథెటర్ (నాళిక)ను పరిశోధకులు అభివృద్ధి చేశారు. బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్, హార్వర్డ్ యూనివర్సిటీలోని విస్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ బయొలాజికల్లీ ఇన్‌స్పైర్డ్ ఇంజనీరింగ్, బ్రిఘామ్‌లోని కార్ప్ ల్యాబ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్ సంస్థలకు చెందిన పరిశోధకులు.. జంతువులపై పరిశోధనల్లో గుండె రంధ్రాలను అతుకు ద్వారా మూసివేయటానికి ఈ కాథెటర్‌ను విజయవంతంగా వినియోగించారు.

బైపాస్ సర్జరీ అవసరం లేకుండా గుండె రంధ్రాలకు ఈ అతుకు వేయటం కోసం అల్ట్రా వయొలెట్ వెలుగు  సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు.  మెడ లేదా, తొడ లోని ఏదైనా నరం ద్వా రా.. గుండెలో రంధ్రం ఉన్న ప్రాంతాని కి ఈ కాథెటర్ సాయంతో మాసికను పంపిస్తారు. సరిగ్గా రంధ్రం ఉన్న ప్రాంతానికి మాసిక చేరుకోగానే.. కాథెటర్‌కు ఇరువైపులా ఉన్న బుడగలు విచ్చుకునేలా చేస్తా రు. ఒక బుడగ గుండెరంధ్రం లోపలి వైపు కు, మరొక బుడగ గుండె గోడ వెలుపలి వైపుకు విచ్చుకుని మాసిక కదలకుండా ఉం డేలా చేస్తుంది. అప్పుడు కేథటర్‌లో యూవీ వెలుతురును వెలిగిస్తారు.

ఈ వెలుతురు దాని బుడగల్లో ప్రతిఫలించి మాసికపై ఉన్న జిగురు పొరను క్రియాశీలం చేస్తుంది. ఈ జిగురు వల్ల మాసిక అక్కడ అతుక్కుంటూ ఉండగా.. కేథటర్‌కు ఉన్న బుడగల ఒత్తిడితో అది రంధ్రాన్ని మూసివేస్తూ సరైన స్థానంలో నిలిచిపోతుంది. ఆ తర్వాత రెండు బుడగలనూ ఆర్పివేసి.. కేథటర్‌ను వెనక్కు తీసివేస్తారు. కాలం గడిచేకొద్దీ.. ఈ మాసిక చుట్టూ, దానిపైనా మామూలు గుండె కణజాలం పెరిగి రంధ్రం దానికదే మూసుకుపోతుంది. మాసిక ఇక తన అవసరం లేదన్నపుడు గుండె కణజాలంలోనే కరిగిపోతుంది. ఈ విధానం వల్ల ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకపోగా గుండెకు కుట్లు వేయాల్సిన అవసరం కూడా ఉండదని పరిశోధకులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు