దొంగ నుంచి మాఫియా డాన్ వరకు..

26 Oct, 2015 15:42 IST|Sakshi
దొంగ నుంచి మాఫియా డాన్ వరకు..

చీకటి నేరసామ్రాజ్యపు డాన్‌గా ఎదిగిన ఛోటా రాజన్‌ ఒకప్పుడు మాములు దొంగ. మొదట ముంబైలో చిన్నచిన్న నేరాలు చేస్తూ అతడు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు కొంతకాలం నమ్మిన బంటుగా మెలిగాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఇప్పుడు దావూద్‌కు బద్ధ శత్రువుగా మారాడు. మొదట చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడుతూ.. బడా రాజన్‌గా పేరొందిన రాజన్ నాయర్ గ్యాంగ్ తరఫున ఛోటా రాజన్ చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించాడు. అతని అసలు పేరు రాజేంద్ర సదాశివ నికాల్జే. ముంబైలోని దిగువ మధ్య తరగతి కుంటుంబలో పుట్టిన అతన్ని అందరూ 'నానా' అని ముద్దుగా పిలుచుకునేవారు. బడా రాజన్ హత్యకు గురికావడంతో ఆ గ్యాంగ్ పగ్గాలను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ తర్వాత దావూద్ గ్యాంగ్‌లో చేరి ఛోటారాజన్ అనేక నేరాలకు పాల్పడ్డాడు.

దావూద్‌తో శత్రుత్వం పెరుగడంతో 1988లో ఇండియా నుంచి దుబాయ్‌కి పారిపోయాడు. బలవంతపు వసూళ్లు, హత్యలు, స్మగ్లింగ్, మాదక ద్రవ్యాల సరఫరా, సినిమాలకు ఫైనాన్సింగ్ వంటి నేరాలతో అతను ముంబైను, ప్రపంచ దేశాలను హడలెత్తించాడు. అతడిపై భారత్‌లో 17 హత్య కేసులు ఉన్నాయి.  ఈ నేపథ్యంలో మలేషియాలో అతన్ని ఇంటర్ పోల్ అరెస్టుచేయడం.. ఈ కేసుల దర్యాప్తులో కీలక ముందడుగుగా భావించవచ్చు.

దావూద్‌తో విభేదాలు!
1993లో జరిగిన ముంబై వరుస బాంబు పేలుళ్లతో దావూద్-ఛోటా రాజన్ మధ్య విభేదాలు వచ్చాయి. అదే సమయంలో దావూద్ నేర సిండికేట్‌ అయిన డీ కంపెనీని నిర్వహిస్తున్న సత్య, ఛోటా షకీల్, శారదషెట్టి.. ఛోటారాజన్‌కు వ్యతిరేకంగా దావూద్‌కు అనేక కథనాలు వండివార్చారు. దీంతో ఇద్దరి మధ్య వైరం పెరిగి ఇరు గ్యాంగ్‌లు పరస్పరం తలపడటం మొదలుపెట్టాయి. మతకారణాలతో జరిగిన ముంబై పేలుళ్లను వ్యతిరేకించిన ఛోటా రాజన్.. దావూద్‌ నుంచి ముప్పు పొంచి ఉందనే కారణంతో తన మకాం ముంబై నుంచి మొదట మలేషియాకు, ఆ తర్వాత దుబాయ్‌కి మార్చాడు. ఈ నేపథ్యంలో రెండు గ్యాంగుల మధ్య పలుసార్లు దాడులు జరిగాయి.

హత్యాయత్నాలు
ఛోటా రాజన్‌పై కసి పెంచుకున్న దావూద్ 2000 సంవత్సరం సెప్టెంబర్‌లో అతనిపై హత్యాయత్నం చేయించాడు. బ్యాంకాక్‌లోని ఓ హోటల్‌లో ఉన్న రాజన్‌పై  దావూద్ అనుచరుడు ఛోటా షకీల్ దాడి చేశాడు. పిజ్జా డెలివరీ బాయ్‌గా వచ్చిన షకీల్ కాల్పుల్లో ఛోటారాజన్ అనుచరులు రోహిత్ వర్మ, అతని భార్య చనిపోయారు. ఛోటా రాజన్ మాత్రం తెలివిగా ఈ దాడి నుంచి తప్పించుకొని హోటల్ ఫైర్ ఎస్కేప్ రూట్ నుంచి బయటపడ్డాడు. ఆ తర్వాత ఈ దాడికి ప్రతీకారంగా ఛోటా రాజన్ అనుచరులు 2001లో దావూద్ అనుచరులు వినోద్ షెట్టి, సునీల్ సోన్‌పై దాడిచేసి చంపేశారు. వినోద్ షెట్టి అంతంతో ముంబైలో నేర ప్రపంచంలో దావూద్ పట్టు సడలిపోయింది. ఇక వ్యక్తిగత విషయానికొస్తే ఛోటారాజన్‌కు భార్య అంకితా నికాల్జే, కూతుళ్లు నికిత, ఖుషి ఉన్నారు.

>
మరిన్ని వార్తలు