కాలర్‌ పట్టుకొని బూటుతో కొట్టిన కమెడియన్‌

23 Mar, 2017 12:13 IST|Sakshi
కాలర్‌ పట్టుకొని బూటుతో కొట్టిన కమెడియన్‌
దేశంలో ప్రముఖ కమెడియన్‌గా పేరొందిన కపిల్‌ శర్మ తన సహనటుడు సునీల్‌ గ్రోవర్‌పై విమానంలో దాడి చేసిన ఘటనకు సంబంధించి అనేక కథనాలు తెరపైకి వచ్చాయి. తాజాగా విమానంలో ఉన్న ఓ ప్రత్యక్ష సాక్షి ఈ ఘటన ఎలా జరిగింది, అసలు కపిల్‌ శర్మ ఎందుకు సునీల్‌ గ్రోవర్‌ను కొట్టాడు అన్న దానిపై సవివరంగా తెలియజేశాడు. అతడు తెలిపిన వివరాల ప్రకారం..

ఆస్ట్రేలియాలో షో ముగించుకొని ఎయిరిండియా విమానంలో కపిల్‌ శర్మ బృందం ('ద కపిల్‌ శర్మ షో'లో పాల్గొనే నటీనటులు, సహాయక సిబ్బంది) తిరుగుప్రయాణమయ్యారు. అయితే, 12 గంటలపాటు ప్రయాణం సాగే ఈ విమానంలో కపిల్‌ శర్మ గ్లెన్‌ఫిడ్డిక్‌ విస్కీని ఫుల్‌ బాటిల్‌ను లాగించాడు. అతడు తాగుతుండగానే అతని బృందం సభ్యులు విమాన సిబ్బంది తెచ్చి ఇచ్చిన ఆహారాన్ని తినడం ప్రారంభించారు. తాగిన మత్తులో ఉన్న కపిల్‌కు ఇది ఆగ్రహం తెప్పించింది. 'నేను చెప్పకుండానే మీరు అన్నం తినడం ఎలా మొదలుపెట్టారు?' అంటూ కపిల్‌ కోపంతో కేకలు వేశాడు. దీంతో సహనటులు విస్తుపోయారు.

ఈ దశలో సునీల్‌ గ్రోవర్‌ కలుగజేసుకొని కపిల్‌ను శాంతింపజేసేందుకు ప్రయత్నించాడు. దీంతో కపిల్‌ లేచి షూను అతనిపై విసిరికొట్టాడు. అతని కాలర్‌ పట్టుకొని లాగి.. పలుసార్లు చెంపదెబ్బలు కొట్టాడు. దీంతో గలాటా వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో కపిల్‌ బృందంలోని ఓ మహిళకు కూడా దెబ్బలు తగిలాయి. దీంతో విమాన సిబ్బంది కలుగజేసుకొని.. కపిల్‌ను శాంతింపజేయాలని ఆయన బృంద సభ్యులనుకోరారు. అతని తీరుతో భయకంపితులైన వారు తాము ఏం చేయలేమంటూ చేతులు ఎత్తేశారు. కపిల్ బృందం సభ్యులపైనా గట్టిగా కేకలు వేస్తూ.. తిట్లదండకాన్ని అందుకున్నాడు. గట్టిగా అరుస్తూ అతడు చేసిన గలాటాతో ఎకనామిక్‌ క్లాస్‌లో ఉన్న సాటి ప్రయాణికులు సైతం చికాకు పడ్డారు. పలువురు విమాన సిబ్బంది వద్దకు వెళ్లి.. పరిస్థితి సద్దుమణగడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

చాలాసేపు బృందం సభ్యులపై అరుస్తూ.. నానా దుర్భాషలు ఆడుతూ.. కపిల్‌ గలాటా చేశాడని ఆ ప్రత్యక్ష సాక్షి వివరించారు. ఈ వ్యవహారం మొత్తం సునీల్‌ శాంతంగా, నిగ్రహంగా ఉన్నాడని తెలిపారు. అయితే, ఈ ఘటన వెలుగులోకి రాకుండా దృష్టి మళ్లించేందుకు తన ప్రియురాలు జిన్నీని పెళ్లి చేసుకోబోతున్నట్టు కపిల్‌ ట్విట్టర్‌లో ప్రకటించినట్టు తెలుస్తోంది. కపిల్‌ తీరుతో ఇబ్బంది పడిన సునీల్‌ గ్రోవర్‌తోపాటు.. సహ నటులు అలీ అస్గర్‌, చందన్‌ ప్రభాకర్‌లు కూడా 'ద కపిల్‌ శర్మ షో' షూటింగ్‌కు హాజరవ్వడం లేదని తెలుస్తోంది. 
 
Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా