మరోసారి ఉర్జిత్‌ పటేల్‌కు నోటీసులు?

23 Mar, 2017 18:15 IST|Sakshi

న్యూఢిల్లీ:  పెద్దనోట్ల రద్దు  ఏర్పాటైన పార్లమెంటరీ  స్టాండింగ్‌ కమిటీ ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌కు మరోసారి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.  ఏప్రిల్‌ 20 న కమిటీ ముందు హాజరు  కావాల్సిందిగా  కోరింది. డీమానిటైజేషన్‌ కాలంలో(50 రోజులు) ఎన్ని పాత కరెన్సీ నోట్లు వెనక్కి వచ్చాయి, రీమానిటైజేషన్‌ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది తదితర అంశాలపై  కాంగ్రెస్ నాయకుడు వీరప్ప మొయిలీ సారథ్యంలోని  పార్లమెంటరీ ప్యానెల్ ఉర్జిత్‌ను ప్రశ్నించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

మరోవైపు ఆర్థికవ్యవహారాల కార్యదర్శి శక్తి కాంత్‌ దాస్‌,  ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్యదర్శి అంజులే చిబ్ దుగ్గల్‌ ని  కూడా కమిటీ ముందు హాజరు కావాలని  కమిటీ కోరింది. జనవరి 18 న సమావేశమైన కమిటీ ఏప్రిల్‌ 20 న తిరిగి సమావేశమయ్యేందుకు నిర్ణయించింది. ఈమేరకు ఆర్‌బీఐకి, ఆర్థిక అధికారులకు  నోటీసులు జారీ చేసింది. కమిటీ తన తుది నివేదికను రూపొందించే క్రమంలో ఓరల్‌ ఎవిడెన్స్‌ నిమిత్తం జరగనున్న చివరి సమావేశం కావచ్చని భావిస్తున్నారు. అలాగే  ఏప్రిల్‌ 20 సమావేశానికి ఉర్జిత్‌ పటేల్‌ హాజరుకాని పక్షంలో మరో సమావేశం నిర్వహించాల్సి వస్తుందనే  సూచన కూడా ఇచ్చనట్టు  తెలుస్తోంది.  31మంది సభ్యుల స్టాండింగ్ కమిటీలో బీజేపీ నుంచి నిషికాంత్‌ దూబే, బిజెపి కిరిత్‌ సోమయ్య, నరేష్ అగర్వాల్(ఎస్‌పీ) దినేష్ త్రివేది(టీఎంసీ) సతీష్ చంద్ర మిశ్రా (బీఎస్‌పీ) తదితరులు  ఉన్నారు.

అయితే గత సమావేశంలో నగదు విత్‌డ్రాపై పరిమితి, ఎత్తివేతపై కాంగ్రెస్ ఎంపి దిగ్విజయ్ సింగ్  పలు ప్రశ్నలు సంధించిన సందర్భంగా  మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను ఆదుకున్నారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పద్దని పటేల్‌కు సలహా ఇచ్చారట..  పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఉర్జిత్ పటేల్‌ను ప్రశ్నించి ఒత్తిడికి గురిచేసింది. మన్మోహన్ సింగ్ మధ్యలో కల్పించుకుని ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పవద్దని ఉర్జిత్‌కు సలహా ఇచ్చారని సమాచారం.  నగదు పరిస్థితి ఎప్పుడు సాధారణ పరిస్థితికి వస్తుందనే దానిపై ఉర్జిత్ పటేల్ సమాధానం ఇవ్వలేదు.  రూ.500, రూ.1000 పాత నోట్లను రద్దు చేసే విషయంలో ప్రభుత్వం నుంచి  సలహాను నవంబర్‌ 7న అందుకున్నామని, మరునాటి దీనికిఆర్‌బీఐ సమ్మతించిందని లిఖిత పూర్వక సమాధానంలో  వెల్లడించింది. దీనికి  కొన్ని గంటల తరువాత ప్రధాని టీవీలో  ఈ షాకింగ్‌ ప్రకటన చేసినట్టు వివరణ  ఇచ్చింది. అలాగే  86 శాతం చలామణిలోఉన్న పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎంత నగదు బ్యాంకులకు జమ అయిందో స్పష్టంగా చెప్పలేకపోయారు.  రద్దైన మొత్తం పెద్దనోట్ల విలువ రూ.15.44 లక్షల కోట్లు కాగా, రూ.9.2లక్షల కోట్ల కొత్త నోట్లు చలామణిలోకి వచ్చాయని  ప్రకటించిన సంగతి తెలిసిందే.  


 

మరిన్ని వార్తలు