మాల్దీవుల ఉపాధ్యక్షుడి అరెస్ట్

25 Oct, 2015 01:47 IST|Sakshi
మాల్దీవుల ఉపాధ్యక్షుడి అరెస్ట్

మాలె: మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో దేశ ఉపాధ్యక్షుడు అహ్మద్ అదీబ్(33)ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. గత నెల 28న యమీన్ సౌదీ అరేబియా తీర్థయాత్ర ముగించుకుని తిరిగొస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న బోటులో బాంబు పేలింది. ప్రమాదం నుంచి యమీన్ సురక్షితంగా బయటపడగా, ఆయన భార్య, ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. దేశ అధ్యక్షుడిని హత్య చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో అదీబ్‌ను అరెస్ట్ చేసినట్టు, ఆయన్ను ధూనిధో జైలుకు తరలించినట్టు హోంమంత్రి ఉమర్ నసీర్  తెలిపారు.

సింగపూర్ నుంచి స్వదేశానికి చేరుకున్న అదీబ్‌ను మాల్దీవుల ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఉపాధ్యక్షునిగా ఉన్న మహమ్మద్ జమీల్‌ను దేశద్రోహ ఆరోపణలతో పదవి నుంచి తప్పించిన అధ్యక్షుడు యమీన్.. ఆ స్థానంలో అదీబ్‌ను  మూడు నెలలక్రితం నియమించారు. తనపై జరిగిన హత్యాయత్నం నేపథ్యంలో రక్షణ మంత్రి మూసాఅలీ జలీల్‌ను పది రోజులక్రితం తొలగించిన యమీన్.. తాజాగా అదీబ్ అరెస్ట్‌కు కొన్ని గంటల ముందుగా పోలీస్ చీఫ్ హుస్సేన్ వాహిద్‌పై సైతం వేటేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు