ఆ సూసైడ్ నోట్ రాసిందెవరు?

23 Apr, 2015 18:27 IST|Sakshi
ఆ సూసైడ్ నోట్ రాసిందెవరు?

రాజకీయ రంగు పులుముకున్న రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ కళ్యాణ్‌వత్ ఆత్మహత్య సంఘటనలో కొత్తకోణం వెలుగుచూసింది. ఆత్మహత్యకు ముందు గజేంద్ర రాసినట్టు చెబుతున్న సూసైడ్ నోట్ అసలు ఆయన రాసింది కాదని, ఆ నోటులోని రాతకు, ఆయన చేతిరాతకు సంబంధం లేదని ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు చెబుతున్నారు. పైగా ఆ నోటు రాజకీయ పరిభాషలో ఉందని, ఎక్కడా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు గజేంద్ర పేర్కొనలేదని స్వగ్రామంలో ఆయన అంత్యక్రియలకు హాజరైన కుటుంబ సభ్యులు తెలిపారు.

దౌసా జిల్లాలోని నంగల్ జమర్‌వాడ గ్రామంలో గురువారం కుటుంబ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ నాయకుల సమక్షంలో గజేంద్రసింగ్ అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగానూ రాజకీయ నినాదాలు వినిపించాయి. టెలివిజన్‌లో గజేంద్ర రాసినట్టు చెబుతున్న సూసైడ్ నోటును చూశామని, ఆ చేతి రాత ఆయనది కాదని ఐదుగురిలో నాలుగో సోదరి అయిన రేఖా కన్వర్, గజేంద్ర మామ గోపాల్ సింగ్ మీడియాకు తెలిపారు.

గజేంద్ర తమ్ముడు విజేంద్ర సింగ్ మాత్రం సూసైడ్ నోట్ గజేంద్ర రాశారా, లేదా? అన్న విషయం జోలికి వెళ్లకుండా, అసలది సూసైడ్ నోటులా లేదని చెప్పారు. అందులో తన తండ్రితో ఉన్న గొడవలను ప్రధానంగా ప్రస్తావించాడే తప్ప ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఎక్కడా చెప్పలేదని వ్యాఖ్యానించారు. బహూశ తాను ఇవ్వదల్చుకున్న ఉపన్యాసం గురించి నాలుగు ముక్కలు రాసుకున్నాడో, ఏమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ‘అకాల వర్షాల కారణంగా పంటకు నష్టం ఏర్పడడంతో నా తండ్రి నన్ను ఇంట్లోకి రావద్దన్నాడు. నాకు ముగ్గురు పిల్లలు. జై జవాన్, జై కిసాన్ అంటూ నేను ఎలా ఇంటికి వెళ్లగలను’ అని ఆ లేఖలో ఉంది. సూసైడ్ నోటు గజేంద్రనే రాశారా, లేదా అన్న విషయాన్ని  నిర్ధారించుకోవడానికి ఆ లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు