ఈసీది విచిత్ర నిర్ణయం: ఏచూరి

25 Jan, 2017 10:07 IST|Sakshi
ఈసీది విచిత్ర నిర్ణయం: ఏచూరి

భువనేశ్వర్‌: ఎన్నికలకు ముందే బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఎన్నికలసంఘం(ఈసీ) ఓకే చెప్పడం విచిత్రంగా ఉందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఎన్నికలున్న ఐదు రాష్ట్రాల ప్రయోజనాలను మినహాయించి బడ్జెట్‌ను తయారుచేశారనడం ఆశ్చర్యంగా ఉందని ఏచూరి వ్యాఖ్యానించారు. ఐటీ మినహాయింపు పరిధిని పెంచడం, సన్నకారు రైతులకు వ్యవసాయ రుణాల మాఫీ లాంటి వాటి నిర్ణయాలు తీసుకుంటూ ఎన్నికలపై ప్రభావం ఉండదనడం విచిత్రంగా ఉందన్నారు.

గతంలో 2012లో ఇలాంటి పరిస్థితే వచ్చినపుడు గత ప్రభుత్వం బడ్జెట్‌ను ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టిందని, ఇప్పుడూ వాయిదావేయాల్సిందేనని చెప్పారు. సాధారణ బడ్జెట్‌ ఖచ్చితంగా ఓటర్లను ప్రభావితం చేస్తుందన్నారు. ఐదు రాష్ట్రాల్లో వామపక్షాలు ఉమ్మడిగా అభ్యర్థులుగా బరిలోకి దింపుతాయన్నారు. బుల్లెట్, స్పీడ్‌ రైళ్లకంటే ముందు మౌలికాంశాలపై రైల్వేశాఖ దృష్టిపెట్టాలని రైల్వేప్రమాదాలనుద్దేశించి వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు