ఎక్కువ డబ్బిస్తే వారికే సత్రం భూములు

5 Jul, 2016 20:06 IST|Sakshi
ఎక్కువ డబ్బిస్తే వారికే సత్రం భూములు

- రూ.22 కోట్ల కంటే ఎక్కువ చెల్లిస్తామంటే సత్రం భూములు అప్పగిస్తాం
- ఈ డబ్బుతో ప్రభుత్వానికి సంబంధంలేదు.. అక్రమాలు జరగలేదు
- చెన్నైలోని సదావర్తి సత్రం భూముల విక్రయంపై దేవాదాయ మంత్రి మాణిక్యాల రావు వివరణ


విజయవాడ:
ఏపీ దేవాదాయ శాఖకు చెందిన సదావర్తి సత్రం భూముల విక్రయంలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోలేదని ఆ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు చెప్పారు. చెన్నై నగర శివారులోని సత్రం భూములను పత్రికల్లో ప్రకటనలు ఇచ్చిమరీ బహిరంగ వేలం ద్వారానే విక్రయించామని, వేలం ద్వారా లభించిన రూ.22 కోట్లను సత్రం ధర్మకర్తలకే ఇచ్చేస్తామని, ఆ డబ్బుతో ప్రభుత్వాని ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన సదావర్తి సత్రం భూముల విక్రయంపై వివరణ ఇచ్చారు. (చదవండి: సదావర్తి సత్రం భూముల్లో వేలకోట్ల స్కాం జరిగింది)

1885లో వాసిరెడ్డి వెంకట లక్ష్మమ్మ సదావర్తి సత్రానికి భూములు అప్పగించారని, అప్పటికే చాలా వరకు ఆక్రమణలో ఉన్న ఆ భూమిపై కోర్టులో వివాదం నడిచిందని, 1924లో కోర్టు డిక్రీ ద్వారా భూములన్నీ సత్రానికి చెందాయని మంత్రి మాణిక్యాల రావు తెలిపారు. 1962లో సదావర్తి సత్రం ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి వచ్చిందని, అయినప్పటికీ సత్రం ధర్మకర్తలే భూములను పర్యవేక్షిస్తూ వచ్చారని చెప్పారు. '2006లో టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర సత్రం భూములపై అసెంబ్లీలో ప్రస్తావించారు. తర్వాత టీడీపీ నేత కొమ్మలపాటి శ్రీధర్.. సత్రం భూములపై ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. గతేడాది డిసెంబర్ 29న సత్రం భూములను వేలం వేయాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. బహిరంగ వేలం ద్వారా 83.11 ఎకరాల భూమిని విక్రయించగా రూ. 22 కోట్లు పలికింది' అని మంత్రి వివరించారు. (చదవండి: సత్రం భూములపై అంత ఆత్రమా?)

అయితే బహిరంగ మార్కెట్ లో సుమారు రూ.981 కోట్లు విలువచేసే సత్రం భూములను టీడీపీకి చెందిన నేతలు తక్కువ ధరకే కొట్టేశారని ప్రతిపక్ష వైఎస్సార్ సీసీ ఆరోపించింది. భూముల వ్యవహారంపై సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ కూడా విక్రయాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని తేల్చిచెప్పింది. (ధర్మాన కమిటీ మధ్యంతర నివేదిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి) కాగా, సదావర్తి భూముల విలువ రూ.900 కోట్లు ఉంటుందనటం సరికాదని మంత్రి మాణిక్యాల అన్నారు. బ్యాకు గ్యారంటీ ద్వారా ఎవరైనా ముందుకు వచ్చి రూ.22 కోట్ల కన్నా అధికంగా చెల్లిస్తామంటే మళ్లీ బహిరంగ వేలం నిర్వహించి వారికే భూములు అప్పగిస్తామని స్పష్టం చేశారు. భూముల వ్యవహారంలో మొదటినుంచీ పారదర్శకంగానే వ్యవహరిస్తున్నామని చెప్పుకొచ్చారు. (చదవండి: 'సత్రం' ఫైల్.. సూపర్ ఫాస్ట్)

>
మరిన్ని వార్తలు