విడిపోదాం.. కాదు కలిసుందాం!

24 Jun, 2016 19:59 IST|Sakshi
విడిపోదాం.. కాదు కలిసుందాం!

ఒక కుటుంబం గానీ, రాష్ట్రం గానీ, ఒక దేశం గానీ విడిపోవాలంటే అది చాలా బాధాకరమైన నిర్ణయం అవుతుంది. కొంతమంది కలిసుందాం అంటే, మరికొందరు విడిపోదాం అంటారు. ఎవరి కారణాలు వాళ్లకు ఉంటాయి. ఇప్పుడు బ్రిటన్ కూడా సరిగ్గా అలాంటి పరిస్థితిలోనే ఓ నిర్ణయం తీసుకుంది. 28 దేశాలతో కూడిన యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది.

3.35 కోట్ల మంది బ్రిటన్ పౌరులు ఓటింగులో పాల్గొన్నారు. వాళ్లలో ఈయూ నుంచి బయటకు వచ్చేద్దామని 1,74,10,742 మంది అభిప్రాయపడితే, కలిసుందామని 1,61,41,241 మంది అన్నారు. దాంతో 51.9 శాతం ఓట్లతో విడిపోవాలన్న తుది నిర్ణయానికి వచ్చారు. కలిసుందామని చెప్పినవాళ్లు 48.1 శాతం మంది మాత్రమే ఉన్నారు.

మొత్తం నాలుగు దేశాల సమాహారమైన బ్రిటన్ లో ఓ దేశం కచ్చితంగా కలిసుండాలని ఓటేస్తే.. మరో దేశం అందుకు విరుద్ధంగా తీర్పును ఇచ్చింది. ఇంగ్లండ్, ఉత్తర ఐర్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ ల్లో ఇంగ్లండ్, వేల్స్ ల్లోని ప్రజల్లో ఎక్కువ మంది యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేయాలని ఓటింగ్ ద్వారా తెలిపారు. కాగా, ఉత్తర ఐర్లాండ్, స్కాట్లాండ్ ల్లో అత్యధిక జనాభా యూరోపియన్ యూనియన్ లో భాగస్వామ్యులగానే ఉండాలంటూ ఓట్ చేయడం విశేషం.

ఓటింగ్ సరళి..
ఇంగ్లండ్ లో 15,188,406 మంది ప్రజలు యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలంటూ ఓట్ చేయగా.. ఈయూలోనే ఉండాలంటూ 13,266,996 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. స్కాట్లాండ్ లో 1,018,322 మంది ప్రజలు యూనియన్ నుంచి విడిపోవాలని ఓట్ చేయగా, 1,661,191 మంది పౌరులు యూనియన్ తో పాటే కొనసాగాలని తీర్పునిచ్చారు. ఉత్తర ఐర్లాండ్ లో 3,49,442 మంది ప్రజలు విడిపోవాలని ఓట్లు వేయగా, 440,437 మంది కలిసుందామని ఓటు వేశారు.

వేల్స్ లో 854,572 మంది యూనియన్ నుంచి విడిపోవాలని తేల్చి చెప్పగా, 772,347 మంది కలిసి నడవాలని అన్నారు. అత్యధిక జనాభా కలిగిన ఇంగ్లండ్ లో ఎక్కువ శాతం మంది విడిపోవడానికే మొగ్గుచూపారు. దాదాపు 53.4 శాతం మంది విడిపోవాలని ఓటు వేశారు. వేల్స్ నుంచి కూడా ఇదే తరహాలో 52.5 శాతం మంది విడిపోదామని గొంతుక కలపడంతో తక్కువ జనాభా కలిగిన స్కాట్లాండ్ నుంచి అత్యధికంగా 62శాతం మంది, ఉత్తర ఐర్లాండ్ నుంచి 55.8శాతం మంది కలిసుందామన్న ఉపయోగం లేకుండా పోయింది.

ఉత్తర ఇంగ్లండ్ లో ఎక్కువ మంది ప్రజలు విడిపోవడానివే మొగ్గు చూపారు. నార్తంబర్లాండ్, ఈడెన్, దుర్హామ్, రిచ్ మండ్ షైర్, అల్లేర్డేల్, హంబ్లేటన్ రాష్ట్రాల నుంచి ఎక్కువ శాతంలో ప్రజలు విడిపోవాలంటూ తీర్పు చెప్పారు. దక్షిణ ఇంగ్లండ్ నుంచి కొన్ని రాష్ట్రాల్లో కలిసుండాలంటూ గట్టిగా గొంతు వినిపించినా మిగిలిన రాష్ట్రాల తీర్పుతో ఆ గొంతు శబ్దం బయటకు వినిపించలేదు. ప్రధానంగా విల్ట్ షైర్, సోమర్ సెట్, కార్న్ వాల్, సౌత్ హంప్ షైర్ తదితర రాష్ట్రాల్లో విడిపోవాలని చెప్పారు.

కాగా, లండన్ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో మాత్రం కలిసుండాలనే గొంతుక ఎక్కువగా వినిపించింది. వెస్ట్ ఆక్స్ ఫర్డ్ షైర్, వేల్ ఆఫ్ వైట్ హార్స్, వెస్ట్ బెర్క్ షైర్ లలోని ప్రజలు కలిసే ఉందామని అన్నారు. తూర్పు, పశ్చిమ రాష్ట్రాల్లో కలిసుందామనే గొంతుక పెద్దగా వినిపించలేదు.  ఈస్ట్ లిండ్సీ, ఈస్ట్ రైడింగ్ ఆప్ హంప్ షైర్, కింగ్స్ లిన్ అండ్ వెస్ట్ నార్ ఫ్లోక్, బ్రెక్ ల్యాండ్, ఈస్ట్ కేంబ్రిడ్జ్, ఈస్ట్ నార్తాంప్టన్ షైర్, హెరే ఫోర్డ్ షైర్, ష్రాప్ షైర్, చెషైర్ వెస్ట్ అండ్ చెస్టర్, ఫారెస్ట్ ఆఫ్ డీన్ తదితర రాష్ట్రాల్లో విడిపోవడానికి మొగ్గు చూపాయి.

మొత్తం 20 రాష్ట్రాలున్న వేల్స్ లో దాదాపు 15 రాష్ట్రాలు విడిపోవడానికి ఇష్టపడ్డాయి. అతి పెద్ద రాష్ట్రమైన పోవైస్ కూడా విడిపోవాలని తీర్పు చెప్పింది. స్కాట్లాండ్ లోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా కలిసుండాలనే ఓట్లు వేశారు. అతిపెద్ద రాష్ట్రాలైన హైలాండ్, అబెర్డీన్ షైర్, పెర్త్ అండ్ కిన్రోస్, అర్గిల్ అండ్ బుటే, డుమ్ ప్రైస్ అండ్ గాల్లోవే, స్కాటిష్ బోర్డర్లు వీటిలో ఉన్నాయి. ఉత్తర ఐర్లాండ్ లోని ఎనిమిది రాష్ట్రాల ప్రజలు విడిపోవాలని ఓటింగ్ చేశారు. కాగా, పెద్ద రాష్ట్రాలైన వెస్ట్ టైరోన్, ఫెర్మనాగ్ అండ్ సౌత్ టైరోన్, మిడ్ ఉల్స్టర్, ఈస్ట్ లండన్ డెర్రీ, సౌత్ డౌన్ లలోని ప్రజలు మాత్రం కలిసుండాలని ఓట్లు వేశారు.

ఇక లాంఛనమే..
ఇక యూరప్ నుంచి బ్రిటన్ విడిపోవడం లాంఛనమే. అయితే, యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోతున్నట్లు బ్రిటన్ ముందుగా యూరోపియన్ కౌన్సిల్ కు తెలియజేయాల్సి వుంటుంది. ఇరువర్గాలు ఈ విషయంపై చర్చించి అంగీకారం తెలిపిన తర్వాత బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు రెండేళ్ల గడువు ఉంటుంది. ఈ లోపు బ్రిటన్ ఈయూ నుంచి బయటకు వస్తుంది.

మరిన్ని వార్తలు