ఓటు ముందు.. తర్వాత మందు: మాజీ సీఎం

15 Oct, 2015 10:00 IST|Sakshi
ఓటు ముందు.. తర్వాత మందు: మాజీ సీఎం

ఎన్నికల్లో మద్యం ప్రభావం చాలా ఎక్కువగానే ఉంటుంది. నాయకులు తమ అనుచరులకు బాటిళ్లకు బాటిళ్ల మద్యం పోయిస్తూనే ఉంటారు. అయితే, ఈ మద్యం మత్తులో పడి ఎక్కడ అసలు పోలింగుకే రాకుండా ఆగిపోతారోననే భయం కూడా సదరు నాయకులకు ఉంటుంది. సరిగ్గా ఇలాంటి భయమే బిహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీకి కలిగినట్లుంది. అందుకే తన అనుచరులకు 'ఓటు ముందు.. తర్వాత మందు' (పెహలే మత్దాన్, ఫిర్ మద్యపాన్) అనే సూత్రాన్ని చెబుతున్నారు.

ముఖ్యమంత్రి పదవి నుంచి తనను తప్పించిన తర్వాత హిందూస్థానీ ఆవామీ మోర్చా అనే కొత్త పార్టీ పెట్టుకుని, ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్న మాంఝీ.. తన వర్గంలోని ఓటర్లెవరూ పోలింగ్ రోజున ఓటు వేయకుండా మద్యం ముట్టుకోవద్దని కోరారు. తన ప్రత్యర్థులు పేదలకు విపరీతంగా డబ్బు, మద్యం పంచుతున్నారని ముషాహర్ వర్గానికి చెందిన మాంఝీ ఆరోపిస్తున్నారు. గయ జిల్లాలో నక్సల్ ప్రభావిత ప్రాంతమైన ఇమామ్గంజ్లో జేడీయూ నేత, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఉదయ్ నారాయణ్ చౌదరితో ఆయన పార్టీ అభ్యర్థి తలపడుతున్నారు. ఇక్కడి ప్రత్యర్థులు మందు సీసాలు పంచుతున్నారని, కానీ వాటిని ఓటు వేసేవరకు ముట్టుకోవద్దని తాను తనవాళ్లకు చెబుతున్నానని మాంఝీ చెబుతున్నారు.

ఇన్నాళ్లుగా తనకు పెట్టని కోటలా ఉన్న మఖ్దుంపూర్ నియోజకవర్గం నుంచి మాంఝీ పోటీ చేస్తున్నారు. మహాదళితులకు పంచుతున్న మద్యం బాగా విషపూరితం అయి ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మద్యాన్ని పరీక్ష చేయిస్తామని, ఒకవేళ అది కల్తీ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు