ఆంధ్రాబ్యాంకుకు టోపీ.. ఐదుగురి అరెస్టు

29 May, 2015 19:31 IST|Sakshi
ఆంధ్రాబ్యాంకుకు టోపీ.. ఐదుగురి అరెస్టు

నకిలీ డాక్యుమెంట్లతో ఆంధ్రాబ్యాంకును రూ. 10 లక్షల మేర మోసం చేసిన ఐదుగురు వ్యక్తులను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లలో భార్యాభర్తలు కూడా ఉన్నారు. ప్రభుత్వ రబ్బరు స్టాంపులకు నకిలీలు తయారుచేయించి, వాటితో అగ్రిమెంట్లు రూపొందించి, వాటి ఆధారంగా బ్యాంకులో గృహరుణం తీసుకున్నారు. ఇలా బ్యాంకును మోసం చేసినవాళ్లలో ప్రశాంత్ భాగ్వే, ప్రతిజ్ఞా భాగ్వే, అజయ్ ఆంగ్రే, సంకేత్ కాంబ్లే, రవి పాటిల్ ఉన్నారు.

వీళ్లలో ప్రశాంత్ భాగ్వే అనే వ్యక్తి తాను థానెలోని డొంబివాలి ప్రాంతంలో పాటిల్ నుంచి వీనస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఓ ఫ్లాట్ కొన్నట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించాడు. వాటి ద్వారానే గృహరుణం తీసుకున్నాడు. దీంతోపాటు సంజయ్ అఖాడే అనే వ్యక్తిని మోసం చేసి అతడివద్ద నుంచి రూ. 60 వేల మొత్తం తీసుకున్నారు. దాంతో వీళ్ల మోసం మొత్తం విలువ రూ. 10.60 లక్షలకు చేరింది. దీనిపై ఫిర్యాదు అందడంతో ప్రశాంత్ భాగ్వేను అరెస్టు చేశారు. నిందితులపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు.

మరిన్ని వార్తలు