టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి ముందస్తు బెయిల్‌

15 Mar, 2017 03:58 IST|Sakshi
టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి ముందస్తు బెయిల్‌

ఫోర్జరీ కేసులో కొన్నాళ్లుగా తప్పించుకుతిరుగుతున్న దీపక్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: ఫోర్జరీ పత్రాలతో భూకబ్జాకు యత్నించిన కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ నేత, ఏపీ ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డికి హైదరాబాద్‌ నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. దీనిని సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాలని హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు నిర్ణయించారు.

అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన దీపక్‌రెడ్డి.. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాక ర్‌రెడ్డికి అల్లుడు. హైదరాబాద్‌ బంజారా హిల్స్‌లోని రోడ్‌ నం.2లో ఉన్న సర్వే నం.129/71లోని 3.37 ఎకరాల స్థలంపై దీపక్‌రెడ్డితో పాటు పలువురి కన్నుపడింది. ఈ స్థలాన్ని కొన్ని దశాబ్దాల క్రితం నగరంలో నివాసమున్న శరణార్థి అయూబ్‌ కమల్‌కు అప్పటి ప్రభుత్వం కేటాయించింది. దీన్ని ఆయన నుంచి 1960లో ఎంవీఎస్‌ చౌదరితో పాటు ఆయన సోదరులు ఉమ్మడిగా ఖరీదు చేశారు. అయితే అయూబ్‌ కమల్‌ ఈ స్థలాన్ని అన్సారీ బ్రదర్స్‌కు విక్రయించినట్లు, వారి నుంచి దీన్ని తాము ఖరీదు చేసి నట్లు జై హనుమాన్‌ ఎస్టేట్స్‌ సంస్థకు చెందిన బి.శైలేష్‌ సక్సేనా, బి.సంజయ్‌ సక్సేనా, బి.ప్రకాశ్‌చంద్ర సక్సేనాలతో పాటు జి.దీపక్‌రెడ్డి బోగస్‌ డాక్యుమెంట్లు రూపొందించి కబ్జాకు యత్నించారు.  

దీంతో వారిపై ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన సీసీఎస్‌ పోలీసులు  దీపక్‌రెడ్డికి నోటీసులు జారీ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు.  అయితే  ఆయన ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో దీపక్‌రెడ్డి తాజాగా నాంపల్లి న్యాయ స్థానం ద్వారా ముందస్తు బెయిల్‌ పొందారు. మరోవైపు పరారీలో ఉన్న ఇతర నిందితులు బి.శైలేష్‌ సక్సేనా, బి.సంజయ్‌ సక్సేనా, బి.ప్రకాశ్‌ చంద్ర సక్సేనాల కోసం సీసీఎస్‌ పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు