నయీం ఆత్మ.. శేషన్న ఇతనే!

17 Sep, 2016 18:51 IST|Sakshi
నయీం ఆత్మ.. శేషన్న ఇతనే!

హైదరాబాద్: నేరసామ్రాజ్యానికి నయీం రాజైతే..  సైన్యాధికారి శేషన్న! టార్గెట్ ను ఎంచుకోవడం మొదలు, రెక్కీలు నిర్వహించడం, స్కెచ్ వేయడం, దాన్ని పక్కాగా అమలుచేయడం.. ఇవన్నీ నయీం గ్యాంగ్ లో నంబర్ 2గా కొనసాగిన శేషన్న పనులు. నయీం ఎన్ కౌంటర్ అనంతరం అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయిన శేషన్న.. గ్యాంగ్ లీడర్ గా మళ్లీ కార్యకలాపాలు మొదలుపెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇన్నాళ్లు ఎలా ఉంటాడో ప్రపంచానికి తెలియని శేషన్న ఫొటో శనివారం మీడియాకు లభించింది.

ఎన్ కౌంటర్ తర్వాత నయీం స్థావరాల నుంచి స్వాధీనం చేసుకున్న డబ్బు, భూముల రిజిస్ట్రేషన్ పత్రాల ఆధారంగా రంగంలోకి దిగిన సిట్..ఇప్పటికే నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన నయీం అనుచరులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. కాగా, నయీంకు 'ఆత్మ' లాంటివాడైన శేషన్న దొరికితే దర్యాప్తు ఓ కొలిక్కి వస్తుందని పోలీసుల భావన. అంతే కాకుండా బెదిరింపులు, కబ్జాల ద్వారా నయీం వసూలు చేసిన భారీ మొత్తంలోని డబ్బును డంప్ ల రూపంలో దాచి ఉండొచ్చని, ఆ డంప్ లు ఎక్కడెక్కడున్నాయో శేషన్నకు కచ్చితంగా తెలుసని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాగైనాసరే శేషన్నను పట్టుకోవాలనుకుంటున్న సిట్ కావాలనే అతని ఫొటోను విడుదల చేసినట్లు తెలుస్తోంది.

ఎవరీ శేషన్న?
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శేషన్న గతంలో పీపుల్స్ వార్ పార్టీలో పనిచేశాడు. బయటికి వచ్చీరాగానే.. అప్పటికే దందాలు నడుపుతోన్న నయీం పంచన చేరాడు. క్రమక్రమంగా గ్యాంగ్ లో నంబర్ 2గా ఎదిగాడు. మహబూబ్ నగర్ జిల్లాలోని మన్ననూరు, అచ్చంపేట, కల్వకుర్తి,షాద్‌నగర్‌ తోపాటు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తదితర ప్రాంతాలు శేషన్న ఆధిపత్యంలో ఉండేవి. ప్రజాప్రతినిధుల నుంచి సామాన్యుల వరకు నయీం తరఫున డీల్స్ చేసింది శేషన్నేనని అరెస్టయిన అనుచరులు వెల్లడించినట్లు సమాచారం.

అంతేకాదు మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ముగ్గురు ప్రజాసంఘాల నేతల హత్యల్లో శేషన్న సూత్రధారిగా ఉన్నాడు. మాజీ మావోయిస్టులను చిత్రహింసలకు గురిచేసి, తిరిగి వారిని నయీం గ్యాంగ్ లో చేర్చుకోవడంలో శేషన్నదే కీలకపాత్ర. నయీంను ఎవరెవరు కలిశారు? అతని ముఠాతో ఎవరెవరికి సంబంధాలున్నాయనే పూర్తి ఆధారాలు శేషన్న దగ్గరే ఉన్నాయని అనుచరుల ద్వారా తెలిసిన సమాచారం. అందుకే ఈ కేసులో శేషన్న అరెస్టు లేదా లొంగుబాటు కీలకంగా మారింది.

మరిన్ని వార్తలు