తెలంగాణ వర్సిటీలపై సర్కారు వివక్ష : కోదండరాం

1 Nov, 2013 06:43 IST|Sakshi
తెలంగాణ వర్సిటీలపై సర్కారు వివక్ష : కోదండరాం

నల్లగొండ, న్యూస్‌లైన్: తెలంగాణ యూనివర్సిటీలకు నిధులు కేటాయింపులో ప్రభుత్వం వివక్ష చూపుతోందని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. విశ్వవిద్యాలయం అభివృద్ధికి నిధులు కేటాయించాలంటూ నల్లగొండలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న దీక్షలను గురువారం ఆయన విరమింపజేసిన అనంతరం మాట్లాడారు. చంద్రబాబు హయాం నుంచే ప్రభుత్వాలు ఉస్మానియా యూనివర్సిటీకి నిధుల కోత మొదలైందని తెలిపారు. ప్రభుత్వ వివక్ష కారణంగానే మహాత్మాగాంధీ యూనివర్సిటీలో పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు జరగడం లేదని చెప్పారు. దీనిపై దశలవారీగా పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
 
 జీఓఎంకు 145 పేజీల నివేదిక
 తెలంగాణ ప్రాంతంలోని సమస్యలు, సీమాంధ్రుల ఆందోళనపై 145 పేజీల నివేదికను కేంద్ర మంత్రుల బృందానికి అందజేసినట్లు ప్రొఫెసర్ కోదర డరాం తెలిపారు. జిల్లా తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో గురువారం నల్లగొండలోని జెడ్పీ సమావేశ మందిరంలో ‘కేంద్ర మంత్రుల బృందం-తెలంగాణ డిమాండ్’ అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన  మాట్లాడారు. నీళ్లు, హైదరాబాద్, ఉద్యోగాలు, విద్యుత్, తదితర అంశాలపై సీమాంధ్రులు నిర్వహిస్తున్న ఆందోళనల్లో అర్థం లేదన్నారు. కేవలం రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకే వారు అపోహలు సృష్టిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర విభజన వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలు, అందుకు పరిష్కారాలను కూడా జీవోఎంకు సమర్పించిన నివేదికలో స్పష్టంగా వివరించమన్నారు. నవంబర్ 1ను విద్రోహదినంగా పాటించాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు