బంగారం ధర మరింత దిగొచ్చే చాన్స్

16 Sep, 2013 02:32 IST|Sakshi
బంగారం ధర మరింత దిగొచ్చే చాన్స్
 న్యూఢిల్లీ: బంగారం, వెండి దిగుమతి టారిఫ్ విలువలను ప్రభుత్వం తగ్గించింది. అంతర్జాతీయ మార్కెట్లలో వీటి ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత వారం వరకూ 458 డాలర్లుగా ఉన్న 10  గ్రాముల బంగారం దిగుమతి టారిఫ్ విలువను తాజాగా 432 డాలర్లకు(26 డాలర్లు) తగ్గించింది. ప్రతీ పదిహేను రోజులకొకసారి ప్రభుత్వం దిగుమతి టారిఫ్ విలువను నిర్ణయిస్తుంది. దీని ఆధారంగా కస్టమ్స్ సుంకాన్ని (ప్రస్తుతం 10 శాతం) వసూలు చేస్తారు. ఇక వెండి దిగుమతి టారిఫ్ విలువను కేజీకి 783 డాలర్ల నుంచి 736 డాలర్లకు తగ్గించింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) తాజాగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 
 
 ఈ రెండింటితో పాటు మరికొన్ని వస్తువుల దిగుమతి టారిఫ్‌లను కూడా సీఈబీసీ తగ్గించింది. ముడి పామాయిల్  దిగుమతి టారిఫ్ విలువను టన్నుకు 833 డాలర్ల నుంచి 827 డాలర్లకు, బ్రాస్ స్క్రాప్‌కు  టన్నుకు 3,748 డాలర్ల నుంచి 3,717 డాలర్లకు తగ్గించింది. ఇక ముడి సోయాబిన్ ఆయిల్ దిగుమతి టారిఫ్ విలువను టన్నుకు 951 డాలర్ల నుంచి  963 డాలర్లకు, ఆర్‌బీడీ పామోలిన్ విలువను టన్నుకు 882 డాలర్ల నుంచి 883 డాలర్లకు పెంచింది. గత వారంలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 1.7 శాతం తగ్గి 1,308.6 డాలర్ల వద్ద ముగిసింది. 
 
 న్యూఢిల్లీలో కూడా బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.450 తగ్గి రూ.30,300కు చేరింది. తాజాగా బంగారం దిగుమతి టారిఫ్ విలువ తగ్గింపు ఫలితంగా పుత్తడి ధర సుమారుగా రూ.165 తగ్గవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే ధర రూ. 300 తగ్గింది. దీంతో నేడు 10 గ్రాముల బంగారం ధర కనీసం రూ. 460 తగ్గొచ్చని అంచనా.
 
>
మరిన్ని వార్తలు