జగన్‌కు బెయిల్ రాకుండా బాబు కుట్ర | Sakshi
Sakshi News home page

జగన్‌కు బెయిల్ రాకుండా బాబు కుట్ర

Published Mon, Sep 16 2013 2:25 AM

chandra babu naidu is stopping bail to ys jagan


 తుని, న్యూస్‌లైన్ :
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌జగన్‌మోహన్ రెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ధ్వజమెత్తారు. తుని పార్టీ కార్యాలయంలో ఆదివారం రాత్రి నియోజకవర్గ కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో చలమల శెట్టి సునీల్‌తో కలిసి ఆదిరెడ్డి మాట్లాడారు. జగన్ ప్రభంజనాన్ని తట్టుకోలేక టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మకై  సీబీఐ ద్వారా అరెస్టు చేయించి నేరారోపణ రుజువు కాకుండానే 16 నెలల పాటు జైల్లో ఉంచారన్నారు. జగన్‌కు బెయిల్ వచ్చే అవకాశం ఉన్న ప్రతీ సారి చంద్రబాబు ఢిల్లీ పెద్దలను కలిసి అడ్డుకుంటున్నారన్నారు.
 
  జగన్‌కు బెయిల్ వస్తే టీడీపీ, కాంగ్రెస్‌ల ఆటలు సాగవని, అందుకే చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవ యాత్రను మధ్యలో ఆపివేసి డిల్లీకి వెళ్లారన్నారు. గతంలోను చిదంబరంతో చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందం చేసుకుని బెయిల్‌ను అడ్డుకున్నారని గుర్తు చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జగన్‌కు బెయిల్ వ చ్చే అవకాశం ఉండడంతో మళ్లీ కుతంత్రాలు చేస్తున్నారని విమర్శించారు. పిల్లనిచ్చిన మామనే  వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాన్ని విభజించాలని చంద్రబాబు నాయుడు పార్టీ తరపున లేఖను యనమల రామకృష్ణుడు చేత ఢిల్లీకి పంపి ఇక్కడ మాత్రం ఆత్మగౌరవ యాత్ర చేశారని దుయ్యబట్టారు. నీటి సమస్య, హైదరాబాద్ విషయాన్ని స్పష్టంగా వివరించ కుండా విభజన చేయడం వల్ల సీమాంధ్ర ప్రాంతంలో ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేని పరిస్థితి నెలకొంటుందన్నారు.
 
 మహానేత రాజశేఖరరెడ్డి రాష్ట్ర విభజనను ఎన్నడూ సమర్థించలేదన్నారు.  ప్రజలను తప్పుదోవ  పట్టించేందుకు కాంగ్రెస్, టీడీపీలు దివంగత నేతపై అభాండాలు వేస్తున్నాయన్నారు. షర్మిల చంద్రబాబు నాయుడును విమర్శించేందుకు అర్హత లేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప వాఖ్యలు చేయడం తగదన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఇటలీ వనిత కాళ్ల ముందు పెట్టిన ఘనత మీది కాదా అని  రాజప్పను ఆయన ప్రశ్నించారు. ఎవరు ఎన్ని కుతంత్రాలు పన్నినా 2014 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అధికారం చేజిక్కించుకుంటుందన్నారు.
 
 కాంగ్రెస్, టీడీపీలు న్యాయ వ్యవస్థ, సీబీఐని ప్రభావితం చేసేలా వ్యవహరిస్తు న్నాయని చలమలశెట్టి సునీల్ అన్నారు. జిల్లాలో షర్మిల నిర్వహించిన సమైక్య శంఖారావ బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టడం చూస్తుంటే జగన్ పట్ల ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో అర్ధమవుతుందన్నారు. జిల్లా మహిళా విభాగం కన్వీనర్ రొంగలి లక్ష్మి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కుసుమంచి శోభారాణి, లోవదేవస్థానం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు లాలం బాబ్జి, మాకినీడి గంగారావు, పార్టీ కన్వీనర్లు అనిశెట్టి సూర్యచక్రరెడ్డి, గారా శ్రీనివాసరావు, స్టీరింగ్ కమిటీ సభ్యులు కుసనం దొరబాబు పాల్గొన్నారు.

Advertisement
Advertisement