నేడు ఎస్‌టీసీ, నైవేలీ లిగ్నైట్ ఐటీడీసీలో డిజిన్వెస్ట్‌మెంట్

2 Aug, 2013 09:02 IST|Sakshi
నేడు ఎస్‌టీసీ, నైవేలీ లిగ్నైట్ ఐటీడీసీలో డిజిన్వెస్ట్‌మెంట్

 న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థలైన స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎస్‌టీసీ), ఐటీడీసీ, నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్‌లో (ఎన్‌ఎల్‌సీ) కేంద్రం నేడు (శుక్రవారం) వాటాలు విక్రయించనుంది. తద్వారా దాదాపు రూ. 380 కోట్లు సమీకరించనుంది. ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో ఎస్‌టీసీ, ఐటీడీసీల్లో వాటాల విక్రయానికి సంబంధించి ఫ్లోర్ ప్రైస్‌కి సాధికారిక మంత్రుల బృందం ఆమోదం తెలిపినట్లు డిజిన్వెస్ట్‌మెంట్ కార్యదర్శి రవి మాథుర్ తెలిపారు. ఎన్‌ఎల్‌సీలో 3.56 శాతం వాటాలను ఇనిస్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ ప్రోగ్రాం (ఐపీపీ) కేంద్రం విక్రయిస్తోంది. షేరు ధర రూ. 58-60 శ్రేణిలో ఉంటుంది. దీని ద్వారా రూ. 350 కోట్లు సమీకరించవచ్చని అంచనా. ఇక, ఐటీడీసీలో 5 శాతం వాటాల విక్రయం ద్వారా రూ. 23.58 కోట్లు, ఎస్‌టీసీలో 1.02 శాతం వాటాల విక్రయం ద్వారా రూ. 10 కోట్లు రాగలవని  అంచనా.
 
 కోల్ ఇండియాపై... మరోవైపు, వాటాల విక్రయం పరిమాణంపై ప్రధాన కార్మిక సంఘాలతో అవగాహన కుదరడంతో కోల్ ఇండియాలో 5 శాతం వాటాల డిజిన్వెస్ట్‌మెంట్ ఈ నెలలోనే ఉండొచ్చని బొగ్గు శాఖ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ తెలిపారు. దీని ద్వారా రూ. 10,000 కోట్లు రావొచ్చని అంచనా.
 

మరిన్ని వార్తలు