పోర్నోగ్రఫీని అడ్డుకునేందుకు కేంద్రం ఏం చేస్తోంది?

26 Nov, 2014 04:27 IST|Sakshi
పోర్నోగ్రఫీని అడ్డుకునేందుకు కేంద్రం ఏం చేస్తోంది?

* లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ పి.శ్రీనివాసరెడ్డి ప్రశ్న

సాక్షి, న్యూఢిల్లీ: ఇంటర్నెట్‌లో అశ్లీల చిత్రాలను (పోర్నోగ్రఫీ) నిరోధించేందుకు, చిన్న విమానాశ్రయాల నిర్మాణానికి, కేజీ బేసిన్‌లో గ్యాస్ వెలికితీతకు కేంద్రం ఏం చర్యలు తీసుకుంటోందని ఖమ్మం లోక్‌సభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. లోక్‌సభలో మంగళవారం ఆయన పోర్నోగ్రఫీపై  కేంద్రాన్ని అడిగిన ఈ ప్రశ్నకు కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీశాఖల మంత్రి రవిశంకర్‌ప్రసాద్ లిఖితపూర్వక సమాధానమిస్తూ.. దీనిపై సైబర్ రెగ్యులేషన్ అడ్వైజరీ కమిటీ కేంద్రానికి సూచనలిస్తోందన్నారు.

ఈ కమిటీలో ప్రభుత్వం, పారిశ్రామిక రంగం, పౌర సమాజం,  విద్యా రంగాల నుంచి పలువురు సభ్యులుగా ఉన్నారని వివరించారు. గత సెప్టెంబర్ 5న  సమావేశమైందని, పోర్నోగ్రఫీని అడ్డుకోవడానికి వీలున్న మార్గాలను కమిటీ అన్వేషిస్తోందని వివరించారు. అలాగే, ఇందుకోసం విదేశీ సాయాన్ని తీసుకోవడం లేదని మరో అనుబంధ ప్రశ్నకు జవాబుగా చెప్పారు. అలాగే, వైర్‌లెస్ డేటా సర్వీసుల క్రమబద్ధీకరణకు ట్రాయ్ చేపట్టిన చర్యలేమిటని ఎంపీ  ప్రశ్నించగా, అన్ని డేటా ప్లాన్లలో కనీస డౌన్‌లోడ్ వేగాన్ని వినియోగదారులకు తెలియపరచాలని, డేటా ప్లాన్ల ఓచర్లపై వీటిని ప్రచురించాల్సి ఉంటుందని తెలిపారు.

చిన్న విమానాశ్రయాల ప్రతిపాదనలేమైనా ఉన్నాయా?
దేశంలోని నగరాల అవసరాలను తీరుస్తూ చిన్న చిన్న విమానాశ్రయాలను నిర్మించే ప్రతిపాదనలేమైనా ఉన్నాయా? అని ఎంపీ పొంగులేటి ప్రశ్నించారు. దీనిపై కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు లిఖితపూర్వక సమాధానమిస్తూ.. టైర్-2, టైర్-3 నగరాల్లో చిన్న ఎయిర్‌పోర్టులను ఏర్పాటుచేయాలని కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇలాంటి 50 ప్రాంతాలను గుర్తించామని వివరించారు. 2014-15 సంవత్సరానికి హుబ్లీ, బెల్గాం, కిషన్‌గఢ్, ఝార్సుగూడ, తేజు ప్రాంతాల్లో పనులు ప్రారంభించనున్నట్టు తెలిపారు. కనీసం 10 లక్షల జనాభా, పర్యాటక, రవాణా, వాణిజ్యపరంగా విజయవంతమయ్యే అవకాశాల ప్రాతిపదికగా మరిన్ని ప్రాంతాల్ని గుర్తిస్తామని తెలిపారు.

కేజీ బేసిన్ గ్యాస్ వెలికితీతపై చర్యలేవి?
కేజీ బేసిన్‌లోని డీ -5 బ్లాక్‌లో గ్యాస్ నిక్షేపాలను వెలికితీయడంలో జరుగుతున్న జాప్యంపై హైడ్రోకార్బన్స్ డెరైక్టర్ జనరల్ ఏదైనా ఎంక్వైరీ కమిటీ వేశారా? అంటూ  ఎంపీ పొంగులేటి కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి మంగళవారం కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ విచారణ జరుపుతోందని వివరించారు. అక్టోబర్ 24న తొలి సమావేశం జరిగిందని, రెండు నెలల్లోపు నివేదిక ఇస్తుందని తెలిపారు.

మరిన్ని వార్తలు