72 జంటలను కలిపిన పోలీసులు

17 Jun, 2017 15:50 IST|Sakshi

సికింద్రాబాద్‌: ఇప్పటికే ‘ఫ్రెండ్లీ’గా మారిపోయిన హైదరాబాద్‌ పోలీసులు ఇంకాస్త వినూత్న పద్ధతుల్లో ప్రజలకు చేరువవుతున్నారు. అందులో భాగంగానే నార్త్‌ జోన్‌ పోలీసులు ‘కలసి ఉంటే కలదు సుఖం’  పేరుతో 72 జంటలను ఒక్కటి చేశారు. వీరంతా గతంలో కలిసిఉండి, రకరకాల విబేధాల కారణంగా విడిపోయినవారే కావడం గమనార్హం. వీళ్లందరికీ ఆయా పోలీస్‌ స్టేషన్లలో కౌన్సిలింగ్‌లు ఇప్పించి, భాగస్వామితో కలిసి ఉండేందుకు ఒప్పంచారు.

సికింద్రాబాద్‌లోని టివోలి గార్డెన్‌లో శనివారం జరిగిన ‘కలసి ఉంటే కలదు సుఖం’ కార్యక్రమానికి నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి, అదనపు పోలీస్‌ కమిషనర్‌, ‘షీ టీమ్స్‌’ ఇంచాంర్జి స్వాతి లక్రా, డిసిపి సుమతి, నాంపల్లి మెట్రోపాలిటన్ న్యాయమూర్తి రాధారాణి,  రచయిత్రి వసంత లక్ష్మి తదితరులు హాజరయ్యారు.

నగర పోలీసులే కాకుండా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) సైతం విడిపోయిన జంటలను కలిపేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుండటం తెలిసిందే. ‘కుటుంబంగా కలిసుందాం-తడి, పొడి చెత్తను విడదీద్దాం’  అనే నినాదంతో జీహెచ్‌ఎంసీ గత జనవరిలో 150 జంటలను కలిపింది. రవీంద్ర భారతిలో నిర్వహించిన ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తాయి.

మరిన్ని వార్తలు