ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ రాదు!

31 Aug, 2016 01:54 IST|Sakshi
ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ రాదు!

ముద్రగడ పోరుకు కాపు నేతల సంపూర్ణ మద్దతు

 సాక్షి, హైదరాబాద్: ‘కాపు రిజర్వేషన్ల ఉద్యమం ఉధృతమైంది. ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ రాదు. ఎంత దూరమైనా పోవాల్సిందే, పోరాడాల్సిందే’ అని కాపు ప్రముఖులు శపథం చేశారు. పోరాటంపై భవిష్యత్ కార్యక్రమాన్ని చర్చించేందుకు హైదరాబాద్‌లో పర్యటిస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ఆయన అనుచరుల గౌరవార్థం ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు మంగళవారమిక్కడి తన స్వగృహంలో విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ముద్రగడ.. ఉద్యమ ప్రారంభం నుంచి తాను, తన కుటుంబ సభ్యులు, కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులు ఎదుర్కొన్న కష్టాలను సుదీర్ఘంగా వివరించారు.

వెన్నంటే ఉంటా: చిరంజీవి
ముద్రగడకు మద్దతు ఇవ్వడంతో మీడియాలో ఓ వర్గం తనను కొందరివాడిగా ముద్ర వేసిందని, అయినా జంకే పరిస్థితి లేదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అన్నారు. ఉద్యమాన్ని వెన్నంటే ఉంటానన్నారు. ముద్రగడ ఎంతవరకు పోరు చేస్తే అంతవరకు వెళతానని దాసరి భరోసా ఇచ్చారు. తమను శత్రువులుగా చూసే వారి పట్ల జాలి పడడం తప్ప చేయగలిగిందేమీ లేదని అంబటి రాంబాబు అన్నారు.  వచ్చేనెల 11న రాజమహేంద్రవరంలో తలపెట్టిన జేఏసీ సమావేశానికి కాపు ప్రముఖులందర్నీ ఆహ్వానించినట్టు ముద్రగడ చెప్పారు. చంద్రబాబు మాట మీద నిలబడే పరిస్థితి కనిపించడం లేదని, అందుకు భవిష్యత్ కార్యాచరణకు రూపుదిద్దుతున్నామన్నారు. వచ్చే నెల 16 తర్వాత మరోసారి హైదరాబాద్ వచ్చి ప్రముఖులందరితో చర్చలు జరుపుతామన్నారు. విందుకు మాజీ కేంద్ర మంత్రి పళ్లంరాజు, వైఎస్సార్‌సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బీజేపీ నాయకుడు అద్దేపల్లి శ్రీధర్,  వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు